పేద వాళ్లు తప్పని సరిగా  పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిపక్ష నేత , వైసిసి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త కమిట్ మెంట్ ప్రటించారు. ఈ రోజు ఆయన అనంతపురం జిల్లాలో  ప్రజాసంకల్పయాత్రలో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ప్రతిపేద తల్లికి సంవత్సరానికి పదిహైదు వేల రుపాయల పారితోషికం తమ  ప్రభుత్వం అందిస్తుందని జగన్ ప్రకటించారు. ఈ  అపురూప పారితోషికం  అందుకునేందుకు తల్లికి  ఆయన ఒక షరతు  పెట్టారు. పిల్లలను తప్పని సరిగా బడిలో చేర్పించాలి. వారిని చదివించాలి.గొప్ప మాట.

అమలయితే ఇది ఒక  వినూత్న పథకం కానుంది. ఎందుకంటే,  ముఖ్యమంత్రి గా ఉన్నపుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పీజు రిఇంబర్స్ మెంట్ ప్రకటించి పేద కుటుంబాలకు విద్య మీద ఉన్న అవగాహననే పూర్తిగా మార్చేశారు. ఎందరో తల్లితండ్రులు పిల్లలను ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర ఉన్నత చదువులు చదివించేందుకు ఈ పథకం బాట వేసింది. ఇది ప్రతి ఇంటా ఒక డాక్టర్ నో ఇంజనీర్ నో, ప్రొఫెషనల్ నో తయారు చేసింది. ఇపుడు దీనిని తాను మరింత ముందుకు తీసుకుపోతున్నట్లు జగన్ ప్రకటించారు.

‘ ఉన్నత విద్యను అంటే ఇంజనీరింగ్,మెడిసిన్ విద్యను వ్యాప్తిచేసేందుకు నాడు నాన్న ఒకడుగు ముందుకు వేశారు. ఆయన కొడుకుగా నేనిపుడు ఈ తల్లు కోసం రెండడుగులు ముందుకేస్తున్నా’ అని ప్రటించారు.

ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, ‘ప్రతితల్లికి వచ్చే మా ప్రభుత్వం ఏడాదికి పదహైదు వేల రుపాయలను అందిస్తుంది. దీనికి మీరు చేయాల్సిందంతా ఒకటే. మీపిల్లలను బడిలో చేర్పించండి, చదువు కొనసాగించండి. మీ ఇంట్లో కూడా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి,’ అని జగన్ అన్నారు.

ఆంధ్రదేశంలో పేదరికం వల్ల 25 శాతం మంది అమ్మాయిలు స్కూల్ మానేస్తున్నారు. వారిలోఅక్షరాస్యత 50శాతమే.  ఇలాంటి కుటుంబాలకు ఇది వరం కానుంది. జగన్ చేస్తున్న హామీలన్నింటిలో చాలా అర్థవంతమయిన  హామీ ఇది.