104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ-సీ37
భారతదేశానికి గర్వకారణంగా హరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ37 వాహకనౌక ఒక చారిత్రాత్మక యాత్ర కోసం నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం ఉదయం 9.28నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ37లోకి 104 ఉపగ్రహాలతో నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంతో 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది ఇస్రో. ప్రపంచంలో నూరు పైగాఉపగ్రహాలను ఒకేసారి కక్షలో ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఇది తెలుగు నేల మీద నుంచి జరగడం విశేషం. తెలుగువారికి గర్వకారణం.
పీఎస్ఎల్వీ-సీ37 మొత్తం 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యావర్తన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. 28.42 నిమిషాల్లో రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రయోగం ప్రారంభమైన తర్వాత 17.29 నిమిషాలకు కార్టోశాట్-2.. రాకెట్ నుంచి 510.383 కిలోమీటర్ల ఎత్తులో విడిపోయాయి.
ఐఎన్‌ఎస్-1ఏ 17.29 నిమిషాలకు, ఐఎన్‌ఎస్-1బి 17.40 నిమిషాలకు వాహక నౌక నుంచి విడిపోయాయి. దీని తర్వాత 18.32 నిమిషాల నుంచి 28.42 నిమిషాల మధ్య విదేశీ ఉపగ్రహాలన్నీ 524 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ నుంచి విడిపోయాయి. 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. శాస్త్రవేత్తల బృందానికి ఇస్రో ఛైర్మన్ అభినందనలు తెలిపారు.
ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే ఇస్రో నూతన అధ్యాయానికి తెరలేపింది. ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ఒకే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపింది. 104 ఉపగ్రహాల్లో అమెరికాకు చెందినవే 96 ఉన్నాయి.
ఇందులో డవు ఉపగ్రహాలు 88, లెమర్ ఉపగ్రహాలు 8. మిగిలిన వాటిలో ఇజ్రాయిల్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం, మన దేశానికి చెందినవి మూడు ఉపగ్రహాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన మూడు ఉపగ్రహాల్లో కార్టోశాట్-2 714 కిలోలు, ఐఎన్‌ఎస్ 1ఎ, ఐఎన్‌ఎస్ 1బి ఉపగ్రహాలు ఒక్కోటి 14 కిలోల బరువున్నాయి. మిగలిన ఉపగ్రహాల బరువు 834 కిలోలు.
నాసా అభినందనలు
తమ దేశానికి చెందిన 96 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) అభినందనలు తెలిపింది. ఇంత భారీ ప్రాజెక్టును ఇస్రో శాస్త్రవేత్తలు సునాయాసంగా చేపట్టారని కొనియాడింది. ఇండియా సాధించిన ఘనతకు సెల్యూట్ చేస్తున్నట్టు నాసా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ముందుముందు పీఎస్ఎల్వీ రాకెట్ మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కాగా, నాసా నేడు చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతంకాగా, ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎంలు చంద్రబాబునాయుడు, కేసీఆర్, విపక్ష నేత వైఎస్ జగన్ తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాభినందనలు తెలిపారు.
