మార్చి 31 తర్వాత ఏకంగా పాత పెద్ద నోట్లనే రద్దు చేసేస్తే సరిపోతుంది కదా?

మార్చి 31 తర్వాత రద్దైన పాత పెద్ద నోట్లుంటే శిక్ష తప్పదని కేంద్రం ఆర్ఢినెన్స్ జారీ చేయటం విచిత్రంగా ఉంది. ఇప్పటి వరకూ మోడి ప్రభుత్వం తీసుకున్న అనేక తుగ్లక్ చర్యల్లో తాజా నిర్ణయం అలాగే ఉంది. ఇదేదో ప్రజలను ఇబ్బందులకు గురిచేయటానికే తప్ప ఇంకెందుకూ ఉపయోగపడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నవంబర్ 8వ తేదీన రద్దైన పెద్ద నోట్లను మార్చి 31 తర్వాత కలిగి ఉంటే శిక్ష తప్పదని కేంద్ర మంత్రివర్గం తాజాగా నిర్ణయించటం పట్ల పలువురు ఆశ్చర్యపోతున్నారు. పాత పెద్ద నోట్లుంటే నోట్లను దాచుకున్నారికే నష్టం గానీ ప్రభుత్వానికి ఏమీ లేదు.

మార్చి 31 తర్వాత ఎలాగూ చెల్లవు కాబట్టి అందరూ ఈలోపే వాటిని మార్చేసుకుంటారు. ఫలానా తేదీ తర్వాత చెల్లవని తెలిసి కూడా పాత పెద్ద నోట్లను దగ్గరుంచుకోటానికి ప్రజలేమన్నా పిచ్చోళ్లా?

మార్చి 31 తర్వాత ఎలాగూ పాత పెద్ద నోట్లు చెల్లవు. అటువంటప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్ఢినెన్స్ జారీ చేయాల్సిన అవసరం ఏమిటి? ఇప్పటి వరకూ పాత పెద్ద నోట్ల చెలామణిని మాత్రమే రద్దు చేసింది.

మార్చి 31వ తేదీ తర్వాత పాత పెద్ద నోట్లున్న వారు చెల్లుబాటు విషయమై న్యాయస్ధానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని కేంద్రం అనుకుంటోంది. అందుకే ఆ అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకూడదనే కేంద్రం ఇటువంటి ఆర్డినెన్స్ జారీ చేసిందని నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఈ వాదనలో కూడా అర్ధం లేదు. ఎందుకంటే, ఇపుడు పాత పెద్ద నోట్ల చెలామణిని మాత్రమే రద్దు చేసిన ప్రభుత్వం మార్చి 31 తర్వాత ఏకంగా పాత పెద్ద నోట్లనే రద్దు చేసేస్తే సరిపోతుంది కదా? అపుడు కేంద్రానికి ఎటువంటి నష్టమూ ఉండదు. ఏమంటారు?