బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాల్లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మూడో పెళ్లికి సిద్ధమయ్యారు. పింకీ లాల్వానీ అనే యువతిని ఆయన లండన్ లో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. 2011లో పింకీకి.. మాల్యా తాను యజమానిగా వ్యవహరించిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం ఇప్పించారు. అప్పటి నుంచే మాల్యా..పింకీతో డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం లండన్‌లో తలదాచుకున్న మాల్యాకు  పింకీనే తోడుగా ఉన్నారు. మాల్యా అన్ని వ్యవహారాలు పింకీనే దగ్గరుండి మరీ చూసుకుంటోందట. మరికొద్ది రోజుల్లో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

తొలుత మాల్యా ఎయిర్‌ ఇండియా మాజీ ఎయిర్‌ హోస్టెస్‌ సమీరా త్యాబ్జీని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి కుమారుడే సిద్ధార్థ్‌ మాల్యా. ఆ తర్వాత మాల్యా తన చిన్ననాటి స్నేహితురాలు రేఖను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వివిధ బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగ్గొట్టిన మాల్యా లండన్‌కు పారిపోయారు. కొన్ని నెలల తర్వాత అక్కడి పోలీసులు మాల్యాను అదుపులోకి తీసుకుని వెస్ట్‌ మినిస్టర్‌ న్యాయస్థానానికి తరలించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే మాల్యా బెయిల్‌పై బయటకువచ్చారు. మాల్యాను భారత్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.