జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్.. ఆరోగ్యం సరిగా లేదా..? ఆయన నోటి వెంట రక్తం కారుతోందా..? ఈ మాటలు చెప్పింది మరెవరో కాదు.. స్వయంగా పవన్ సభాముఖంగా తెలిపాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టులో పర్యటన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఈ పర్యటనలో భాగంగానే పవన్ పుట్టపర్తి సత్యసాయి మందిరాన్ని దర్శించుకొని అనంతరం ధర్మవరం చేరుకొని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. చేనేత కార్మికులు ఆయనకు కష్టాలు వెల్లబుచ్చుకున్నారు. పవన్ ఇకపై వారికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంలోనే పవన్ అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. గత 10 రోజుల నుండి మాట్లాడి మాట్లాడి నా గొంతు ఎండిపోయిందని.. దాంతో తన నోటివెంట రక్తం కారుతుందని వ్యాఖ్యానించారు.

పవన్ మాటలు విన్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిజంగా ఆరోగ్యం అంత బాగోకపోతే.. ఆస్పత్రికి వెళతారు గానీ.. యాత్రలు చేస్తారా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. అయినా.. ఎవరికైనా మాట్లాడితే నోటి నుంచి రక్తం కారుతుందా... అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యం బాగోని చాయలేమీ పవన్ ముఖంలో కనిపించకపోవడంతో.. ఆయన వ్యాఖ్యలపై అనుమానాలు కలుగుతున్నాయి. కేవలం ఉనిఖిని కాపాడుకునేందుకే పవన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.