ఫిరాయింపు ఎంఎల్ఏలకు, పార్టీ నేతలకు ఆయా నియోజకవర్గాల్లో గొడవలవుతున్నాయి. కాబట్టి నియోజకవర్గాల పెంపు అధికారపార్టీలకే అత్యవసరం.
తెలుగురాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు విషయం ‘నాన్నా పులి’ కథలాగ తయారైంది. రెండు ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుండి నియోజకవర్గాలు పెరుగుతున్నాయని సిఎంలు చెబుతూనే ఉన్నారు. కేంద్రం మాత్రం అసలు ప్రతిపాదనే లేదని ఎన్నోమార్లు స్పష్టం చేసింది. ఇటు టిఆర్ఎస్ అటు టిడిపి సభ్యుల ప్రశ్నలకు పార్లమెంట్ లోనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఎన్నోసార్లు స్పష్ట చేసారు. అయినా మళ్ళీ మళ్ళీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం అంగీకరించిందని వార్తలు వస్తూనే ఉడటం గమనార్హం.
‘కొత్త నియోజకవర్గాల ప్రతిపాదనలపై నివేదిక పంపండి’ అంటూ కేంద్రం నుండి రాష్ట్రాలకు తాజాగా సమాచారం వచ్చిందని అధికార పార్టీల అనుకూల మీడియాలో ఓ వార్త వచ్చింది. మళ్ళీ అందులోనే నియోజకవర్గాల పెంపుపై అనేక ప్రశ్నలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నియోజకవర్గాలు పెంచాలంటే రాజ్యాంగాన్ని సవరించాలా అన్న ప్రశ్న ఉంది. నియోజకవర్గాల సరిహద్దుల మార్పు అంత ఆషామాషీగా జరిగేది కాదని కూడా ఆ వార్తలోనే ఉంది. మళ్ళీ కేంద్రం రాజకీయంగా సహకరిస్తే 2019 నాటికే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయని రాసారు.
రాజకీయంగా అంటే కేంద్రం సహకరించటం దైవాధీనమే. ఎందుకంటే, రాష్ట్ర విభజన నేపధ్యంలో ఏపికిచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయింది. ఎందుకంగే, తెలుగు రాష్ట్రాల్లో భాజపా బలం అంతంత మాత్రమే. కేంద్ర నాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సొంతంగా పార్టీ ఎదగలేకపోతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఇపుడున్న సీట్లు దక్కేది కూడా అనుమానమే. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు విషయంలో ఎన్నో అనుమానాలున్నాయి. అందుకే ఏపి అభివృద్ధి విషయాన్ని మోడి పెద్దగా పట్టించుకోవటం లేదని ప్రచారంలో ఉంది. అందులోనూ నియోజకవర్గాల పెంపు వల్ల భాజపాకు ఏమాత్రం లాభం లేదు. ‘లాభం లేనిదే వ్యాపారి వరదన కూడా పోడ’నే సామెతను కమలనాధులే గుర్తుచేస్తున్నారు.
నియోజకవర్గాల సంఖ్య పెరిగితే లాభపడేది అధికార పార్టీలే. ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా ఇతర పార్టీ శాసనసభ్యులను తమ పార్టీల్లోకి లాక్కున్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏలకు, పార్టీ నేతలకు ఆయా నియోజకవర్గాల్లో గొడవలవుతున్నాయి. కాబట్టి నియోజకవర్గాల పెంపు అధికారపార్టీలకే అత్యవసరం. కాబట్టే కేంద్రంపై రెండు పార్టీలూ ఒత్తిడిపెడుతున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగకపోతే రేపటి ఎన్నికల్లో అధికారపార్టీల్లో ముసలం పుట్టినట్లే.
