2004 లో అసెంబ్లీని రద్దు చేసి, పార్లమెంటును రద్దు చేయించి ఎన్డియే ని ముంచినందుకు నాయుడి మీద బిజెపి ప్రతీకారం తీర్చుకుంటున్నదా ?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు న్యూఢిల్లీ వెళ్తున్నారు.
ఆయన ప్రధాని నరేంద్రమోదీని కలుస్తారు. నోట్ల అష్ట కష్టాల తీర్చేందుకు కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి కన్వీనర్ అయ్యాక ఆయన ఢిల్లీ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రులకు నోట్ల కష్టాలు రావడమేమిటి, వచ్చినా మీరు తీర్చలేకపోవడమేమిటి అని ఆయన బ్యాంకర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతీ తెలిసిందే.
చాలా మంది ఆయన గురించి తెలిసిన వాళ్లు ఈ నోట్ల సమస్యకు నాయుడి దగ్గిర చక్కటి పరిష్కారం ఉందని, అందుకే మళ్లీ ఢిల్లీలో చక్రం తప్పి నోట్ల కొరతను తీర్చి మరొకసారి జాతిని యావత్తూ సంభ్రమాశ్చర్చార్యాలకు గురిచేయబోతున్నారని చెబుతున్నారు. ఆయన జాతీయ వార్తల్లో లేక చాలా కాలమయింది.
నాయుడిని ఢిల్లీకి రప్పించి, పెద్ద పీట వేసినట్లే వేసి, నోట్ల రొంపిలోకి తనతో పాటే ఆయన్ని లాగేందుకు బిజెపి ప్రయత్నం చేస్తున్నదని మరొక వర్గం చెబుతున్నది. ఇది నాయుడి మీద బిజెపి కక్ష తీ ర్చు కుంటున్న వైనం అని వర్గం వారు అంటున్నారు.
అంత పగ ఎందుకు?
గుర్తుందా? 2003 నవంబర్ 14 వ తేదీ సుముహూర్తం 12.20 కి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలాని కలిసి అసెంబ్లీ రద్దు చేయమని కోరారు.
ఏడు నెలలు ముందే తాను అసెంబ్లీని రద్దు చేసి, దేశంలో పరిస్థితి అనుకూలంగా గెల్చేది ఎన్డీయే అని పెద్దాయన ప్రధాని వాజ్ పేయిని కూడా ఒప్పించి పార్లమెంటును కూడా రద్దు చేయించిన సంగతి గుర్తుంది కదా.
అపుడు నాయుడు ’కింగ్ మేకర్‘ కాబట్టి కింగ్మేకర్ మాటని కాదనలేక ప్రధాని వాజ్ పేయి కూడా 2004 జనవరి 27న రాష్ట్ర పతి అబ్దుల కలామ్ ను కలసి 2004 ఫిబ్రవరి 6 న, లోక్ సభ ను రద్దు చేయాలని కోరారు.
కింగ్ మేకర్ కోరినట్లు తక్షణం 2004 మార్చిలోపే ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు. ఎన్నికలు యధావిధిగా జరపుతాం, ఏం చేసుకుంటారో చేసుకోపోండని అన్నారు. నాయుడి పథకం పారలేదు. 2004 ఏప్రిల్- మే ఎన్నికల్లో ఆయన నిండా మునిగాడు, బిజెపిని ముంచాడు. పరాజయం పాలయ్యాక, బిజెపి సీనియర్ నేతలంతా, వెంకయ్యనాయుడితోసహా, నాయుడి వల్లే ఎన్డీయే ఓడిపోయిందని విమర్శించారు.
ఇపుడు నోట్ల రద్దు బురద గుంటలో బిజెపి పడిపోయింది. మహాపురుష్ మోదీని అంతా తగ్లక్ అంటున్నారు. దేశం అతలాకుతలం అయిపోయింది. వ్యతిరేక గాలి బాగా వీస్తావుంది. బిజెపికి వూపిరాడటేం లేదు. అందువల్ల తోడుగా నాయుడిని కూడా లాగి తనతో ఆయన్ని ముంచేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నట్లే ఉందని ఈ వర్గం చెబుతున్నది.
2004 మందస్తు ఎన్నికల పేరుతో నాయుడు బిజెపి ముంచాడు కాబట్టి, ఇపుడు బిజెపి నోట్ల బురద ఆయనకూ పూసి నవ్వుల పాలు చేయబోతున్నదనేది ఈ వర్గం ఆలోచన.
నాయుడి ఉత్సాహానికి కారణం
మేలు జరిగితే నావల్ల , కీడుజరిగితే నీవల్ల అనేది నాయుడుగారు రాటు దేలిన ఫిలాసఫీ. చాలా రోజులుగా నాయుడిని జాతీయ పత్రికలేవీ పట్టించుకోవడం లేదు. రాజ్యభారాన్ని కొడక్కప్పగించి ఉత్తరాదికి వెళ్లాల్సిన వయసు. దీనికి మళ్లీ ఒక చక్రం తిప్పాలి. నోట్ల కష్టాలు ఎలా గు వచ్చాయి, వచ్చినవి తీరక పోవు. ఈ లోపు ఢిల్లీలో నాలుగయిదు మీటింగ్ లు పెట్టి ఏదో చేస్తున్నట్లు సందడి చేస్తే, మేలు జరిగితే హెడ్ లైన్స్, నష్టం జరిగితే బిజెపి అకౌంట్ లోకి తోసేయవచ్చ అనేది నాయుడి ఆలోచన. అందుకే ముఖ్యమంత్రుల కమిటీకి మీరే సారధి అనేసరికి ఎగిరి గంతేసి ఒప్పుకున్నారు. ఆయన ఢిల్లీ త్సాహానికి ఇది కారణమని ఈ వర్గం చెబుతూ ఉంది.
తరచూ ఢిల్లీ వెళ్లి దేశాన్ని చక్కబెట్టేందుకు మోదీకి సలహా ఇవ్వాలన్న కోరిక ఈ నాటిది కాదు. 2014 లో ఎన్నికలయ్యాక, మొట్టమొదట మోదీని కలిశాక విలేకరులతో మాట్లాడుతూ అన్నమాటలు పాఠకులు గుర్తుకు తెచ్చుకోవాలి. ‘ఇకనుంచి వారంలో రెండు రోజులు ఢిల్లీ ఉంటాను. మరొక రెండు రోజలు హైదరాబాద్ లో, మిగతా మూడు రోజులు జిల్లాల్లో గడపుతాను,’ అని అన్నారు. మొదటి కోరిక మోదీ తీర్చలేదు. ఇలా కమిటీలు వేసి ఇపుడు తీరుస్తున్నట్లుంది.
