జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ర్యాలీలో జాతీయ జెండాకి అవమానం జరిగింది. అభిమానుల మితిమీరిన అభిమానం కారణంగానే ఈ విధంగా జరిగినట్లు స్పష్టంగా అర్థమౌతోంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడికి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు వేల సంఖ్యలో తరలి వచ్చారు.

కాగా.. ఆయన ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో.. కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆనందంతో జాతీయ జెండాలను ఊపుతూ పవన్ కి స్వాగతం పలికారు. అయితే... ఈ క్రమంలో ఇద్దరి దగ్గర జాతీయ జెండాలు చినిగిపోయాయి. అయినా.. వారు పట్టించుకోలేదు. పవన్ దగ్గరికి రాగానే ఆయన మీదకు జాతీయ జెండాను విసిరేసారు. ఆ జెండాలను పవన్ బౌన్సర్లు పట్టుకొని.. నలిపి పక్కన పడేశారు. పవన్ మీద అభిమానం ఉంటే ఉండి ఉండొచ్చు. దాని కోసం జాతీయ జెండాను ఈ విధంగా అవమానించాల్సిన అవసరం లేదు కదా అంటూ.. నెటిజన్లు విమర్శలు గుప్పించడం గమనార్హం.