(వీడియో) ఈ కటక్ తెలుగువాడికి జేజేలు చెప్పండి
ఒక తెలుగోడు వూరు గాని వూరు కటక్ లో కప్పు టీ తో విప్లవం తీసుకువచ్చాడు, ఆదరించిన వూరు పేరు నిలబెట్టాడు.
ఒదిషా కటక్ లో బక్సిబజార్ అని ఒక బస్తీ ఉంది. అక్కడ ఉండేవాళ్లంతా కూలీనాలి చేసుకునే వాళ్లు, రిక్షా తోలేవాళ్లు, ఇతర కంటికి ఆనని చిన్న చిన్న పనులు చేసి బతు కు వెళ్లదీస్తున్న వాళ్లు. భారత దేశంలోని అన్ని బస్తీల లాగానే ఇది కూడా ఒక మురికి వాడ. ఈ మధ్య హఠాత్తుగా ఈ బస్తీ వార్తలకెక్కింది. జాతీయ, అంతర్జాతీయ విలేకరులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ ఎన్జీవోల ప్రతినిధులు బస్తీకొస్తున్నారు. బస్తీ పేరు ఎక్కడ చూసిన మారుమ్రోగుతూ ఉంది. తాజాగా ఈ మధ్య జిల్లాకలెక్టర్ కూడా వచ్చి పోయారు. దీనికంతటికీ కారణం, అక్కడున్న ఒక చిన్న చాయ్ దుకాణం, దాన్నినడిపే తెలుగోడు దేవరపల్లి ప్రకాశ్ రావు.
ప్రకాశ్ రావుతో ఫోన్లో మాట్లాడండి, తెలుగులో బాగున్నార అనడగండి. అంతే ఆయన అనర్గళంగా తెలుగులో సంభాషన మొదలుపెట్టి, మధ్య మధ్య ఒడియాలో కి దూకుతూ, ఇంగ్లీష్ లో అలవోకగా మాట్లాడుతూ, అపుడపుడు హిందీ వాడుతూ మిని ఇండియాలా ప్రత్యక్షమవుతాడు. ప్రకాశ్ రావు ఖాయిలాపడి, చచ్చిబతికినవాడు. అపరేషన్ జరుగుతున్నపుడు ఎవరో అనామకుడు చేసిన రక్తదానంతో బతికి బయటపడ్డాడు. ఈ రోజు ‘ఇంత వాడు’ అయ్యాడు. ఇది జరిగి 40 సంవత్సరాలయింది. అప్పటినుంచి చావుబతుకుల్లో ఉన్నవాళ్లకి రక్తదానం చేసితీరాలనుకున్నాడు. రక్తమే కాదు, ఎంత సహాయం చేయాలో అంతచేయాలనుకున్నాడు. చేస్తున్నాడు. ఆయన రక్తదానం నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది.
అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన 210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్ లెట్స్ దానం చేశాడు. ఇపుడు, పేదరోగులకు అసుప్రతిలో వేడినీళ్లిస్తాడు, పాలు, బ్రెడ్ అందిస్తాడు, వీలయితే, పళ్లు కూడా అందిస్తాడు. ఇది రోజూ జరిగే ప్రక్రియ. ప్రకాశ్ రావు సేవ చూసి ఒక పెద్ద మనిషి ఆయన గీజర్ కొనిచ్చాడు, అధికారులు ఆసుప్రతిలో ఒక గది ఇచ్చారు. మరొకరెవర్ అంబులెన్స్ ఇచ్చారు. ఇంతకంటే మరొక ముఖ్యవిషయం ఉంది. బస్తీ లో పిల్లలెవరు చదువుకోవడం లేదని, చిల్లరు తిరుగుళ్లో ఉన్నారని కనిపెట్టి, పరిస్థితి మార్చాలనుకున్నాడు.
అంతే, తన రెండుగదుల ఇంటిలో ఒక గదిని స్కూలుగా మార్చేశాడు. పిల్లలని ఒప్పించి ఇంటికి తీసుకువచ్చి, పుస్తకాలు కొనిపించి చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ‘ మొదట్లో తల్లిదండ్రులు నన్నుతిట్టారు. మాపిల్లలకు పాచిపనికి వెళ్లి నాలుగు రూకలు తెచ్చే వాళ్లు. నువ్వు బడిపెట్టాక, వీళ్లు పనిమానేస్తున్నారని దబాయించారు. వాళ్లని ఒప్పించేందుకు చాలా కష్టపడ్డాను. చివరకుభోజనం నేనే పెడతాను అనిచెప్పి వాళ్ల అంగీకారం పొందాను. ఇపుడు నా గది స్కూలయింది. 70 మంది విద్యార్థులు, అయిదుగురు టీచర్లున్నారు. టీచర్ కు రు. 1500 ఇస్తాను.అందరికి భోజనం ఉచితం,’ అని ఎషియానెట్ కు ఫోన్లో వివరించాడు.
ఈ ఖర్చెవరిస్తున్నారు?
‘ఇదంతా నా సొంత డబ్బే. టీ స్టాల్ లో బన్ బిస్కట్ లతో పాటు వడలు కూడా ఉంటాయి. రోజూ అన్ని ఖర్చులు పోను రు. 600 దాకా మిగులుతుంది. అందులో స్కూల్ కోసం రు. 300 ఇస్తాను. నాకుటుంబానికైనా తగ్గిస్తాను, బడి ఖర్చు తగ్గించను. అది జీవితధ్యేయం. చిన్నపుడు డాక్టర్ కావాలని నాకు కల ఉండేది.పేదరికం, అనారోగ్యం వల్ల సాధ్యం కాలేదు. అందువల్ల ఈ పిల్లలను చదివిస్తున్నాను. కొంత మంది మెట్రిక్ లేషన్ పాస్ అయ్యారు కూడా,’ అని స్కూల్ ప్రగతి గురించి వివరించాడు.
’మధ్యాహ్నబోజనానినికి రోజూ రు. 8 కావాలి, అయితే, అంత లేదు. అందువల్ల ఉన్నంతలో చేస్తున్నాను. ఈ మధ్య కలెక్టర్ వచ్చి అభినందించారు. మధ్యహ్నం భోజనం పథకాన్ని మాస్కూల్ కు పొడిగించాలని కోరాను. అయితే, రూల్స్ ప్రకారం ప్రయివేటు స్కూళ్లకు పథకం వర్తించదని చెప్పారు,’ అని అంటూ దీనితో తాను నిరుత్సాహ పడటం లేదు అని అన్నాడు.
పొద్దున పూటంతా చాయ్ దుకాణం నడిపి, మధ్యాహ్నం టీచర్ అవతారం ఎత్తుతాడు ప్రకాశ రావు. ఈ మద్య లో ఒక రౌండ్ సైకిలేసుకుని ఆసుప్రతికి వెళ్లడం ఆయన రోజు వారి పని.
ఇంతకీ ప్రకాశరావు ఎవరు?
ప్రకాశరావు ముత్తాత దేవర పల్లి అప్పాలస్వామి. 1888 ప్రాంతంలో పిల్లా జెల్లా వేసుకుని నడుచుకుంటూ తూర్పు దేశ యాత్ర ప్రారంభించారు. చివరకు వాళ్ల ఒరిస్సా కటక్ సమీపంలో ఉన్న ఒక ప్రాంతంలో మకాం వేశారు. అదిపుడు తెలంగపెంటగా మా రింది. తాత మంచి వంటగాడు కావడంతో బ్రిటిష్ వాళ్ల దగ్గిర కొలువు కుదిరాడు. బెంగాల్ అస్సాం తిగిరి చివరకు తెలంగపెంట కే వచ్చాడు. తండ్రి కృష్ణ మూర్తి రెండోప్రపంచయుద్ధకాంలోసైన్యంలో బర్మాలోపనిచేసి తిరిగొచ్చాడు. కొద్ది రోజులు ఒక ప్రయివేటు కంపెనీలో అర్క్ వెల్డర్ గా పనిచేశాడు. 1960లో టీ స్టాల్ తెరిచాడు. అయితే, తండ్రి చనిపోవడం, తర్వాత టిబి వ్యాధి సోకడంతో ప్రకాశ్ రావు చదువు మానేసి టీస్టాల్ బాధ్యత తీసుకున్నాడు.
అంతర్జాతీయ అవార్డు :
ఈ మధ్య బిసెంట్ సెల్స్ లెస్ సర్వీస్ అవార్డు-2016కి ఆయన ఎంపిక అయ్యారు. ఆయనకు గతంలో చాలా అవార్డులొచ్చాయి. ఇపుడాయన కీర్తి అంతర్జాతీయస్థాయికి చేరుకుంది. ఇపుడాయన వయస్సు 59 సంవత్సారాలు.ప అలసటలేదు, విశ్రాంతి లేదు. ఈ సేవ ఇలాగే కొనసాగుతుందని ఉత్సాహంగా చెబుతాడు.
నీకింత ఉత్సాహం ఎలా వచ్చిందంటే... ‘ఇద్దరు కూతుర్లున్నతండ్రికి కొంచెం గర్వం ఉండాలి. నాకు ఇద్దరు కూతుర్లు. బాగా చదువుకున్నారు. స్థిరపడ్డారు. అదే నా ఉత్సా హానికి అసలు కారణం. నాస్కూళ్లో కూడా అడపిల్లలకు ప్రాధాన్యం.’ అని ముగిస్తాడు. కటక్ ఒకసారి రండి, మా స్కూలుపిల్లలను చూడాలి మీరు- అని ఫోన్లో పలకరించిన వారందరిని ఆహ్వానించడం ఆయనకు అలవాటు