Asianet News TeluguAsianet News Telugu

ఇక నెట్ వినోదం.. డిమాండ్ పెరుగుతున్న వీడియో స్ట్రీమింగ్

గతంలో సినిమా విడుదలైనప్పుడు సకాలంలో చూడలేకపోయేవారు. కానీ ఇప్పుడు విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాలు దాదాపు నెల రోజుల్లో ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వస్తున్నాయి

Indias video streaming industry to grow at 22%
Author
New Delhi, First Published Jun 30, 2019, 12:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సినీ థియేటర్‌లో చూడటం వీలు పడని సినిమాను టీవీలో వీక్షించాలంటే ఇంతకుముందు చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చేది. తీరా ఆ సినిమా టీవీలో ప్రసారమయ్యే నాడు మీకు పని పడి బయటికి వెళ్లాల్సి వచ్చినా.. ఆ సమయానికి కరెంట్‌ పోతే.. మనసు ఊసూరుమనిపిస్తుంది.

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరుణంలో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) సేవల కంపెనీల రంగ ప్రవేశం తర్వాత సీన్‌ మారింది. ఓటీటీ సేవల వినియోగదారులకు కొత్త చిత్రాలు, బ్లాక్‌బస్టర్‌ సినిమాలు సైతం నెల రోజుల్లోనే అందుబాటులోకి వస్తున్నాయి. 

కేవలం దేశీయ, అంతర్జాతీయ సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లు, షార్ట్‌ ఫిల్మ్స్‌తోపాటు మరెన్నో. పైగా, మీకు వీలున్న సమయంలో వీక్షించే వెసులుబాటు ఉంటుంది. టీవీలో లేదంటే మొబైల్‌లోనూ చూడగలిగే సౌకర్యం. దీంతో భారత్‌లోనూ ఓటీటీ సేవలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది.
 
ఇంటర్నెట్‌ యుగంలో డిజిటల్‌ సేవల వినియోగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. 4జీ సేవల రంగ ప్రవేశంతో భారత్‌లోనూ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఆన్‌ డిమాండ్‌ వీడియో సేవలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. మున్ముందు మరింత జోరందుకోనుందని అంతర్జాతీయ వృత్తి నైపుణ్య సేవల కంపెనీ ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) తాజా నివేదిక తెలిపింది.

2018 చివరినాటికి దేశంలో ఓటీటీ వీడియో సర్వీసుల మార్కెట్‌ సుమారు రూ.4,466 కోట్ల (63.8 కోట్ల డాలర్ల)కు చేరుకుంది. 2023 నాటికి ఏటేటా 21.8 శాతం వృద్ధితో 170 కోట్ల డాలర్ల (రూ.11,900 కోట్లు) స్థాయికి చేరుకోవచ్చని పీడబ్ల్యూసీ అంచనా వేసింది. 

వీడియో ఆన్‌ డిమాండ్‌ సబ్‌స్ర్కిప్షన్‌ డిమాండ్‌ ఏటేటా 23.3 శాతం వృద్ధి చెంది 150 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని నివేదికలో పేర్కొంది. అంటే, 2023 నాటికి ఓటీటీ కంపెనీల మొత్తం ఆదాయంలో వీడియోల సబ్‌స్ర్కిప్షన్‌ ద్వారా వచ్చే వాటా 84 శాతానికి చేరుకోనుంది. 

వచ్చే నాలుగేళ్లలో భారత ఓటీటీ మార్కెట్‌ దక్షిణ కొరియాను ఓవర్‌ టేక్‌ చేయనుందని, ప్రపంచంలో 8వ అతిపెద్ద ఓటీటీ మార్కెట్‌గా అవతరించనుందని పీడబ్ల్యూసీ అంటోంది. 2023 చివరినాటికి ప్రపంచవ్యాప్త ఓటీటీ మార్కెట్‌ పరిమాణం 7,280 కోట్ల డాలర్ల స్థాయికి పెరగవచ్చని అంచనా.
 
భవిష్యత్‌లో మీడియా, వినోద రంగంలో ఓటీటీ సేవలే వేగంగా వృద్ధి చెందుతాయని విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాది రూ.2,64,588 కోట్లకు చేరుకున్న దేశీయ మీడియా, వినోద రంగం ఏటేటా 11.28 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 2023 నాటికి రూ.4,51,405 కోట్లకు చేరుకోవచ్చని పీడబ్ల్యూసీ అంచనా వేసింది. 

నాలుగేళ్లలో ఓటీటీ, ఆన్‌లైన్‌ గేమింగ్‌, ఇంటర్నెట్‌ అడ్వర్టైజింగ్‌ విభాగాలు అత్యధిక వృద్ధిని నమోదు చేసుకోనున్నాయని అంటోంది. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ నివేదిక ప్రకారం.. 2020 నాటికి దేశంలో ఓటీటీ సేవల వినియోగదారుల సంఖ్య 50 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. 

ప్రస్తుతానికి దేశంలో హిందీ, ఇంగ్లీషు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, ఇతర వీడియో కంటెంట్‌లను అందించే ఓటీటీ ప్లేయర్లే అధికం. భవిష్యత్‌లో స్థానిక భాషల్లో ఆన్‌ డిమాండ్‌ వీడియోలు అందించే సంస్థలు రంగ ప్రవేశం చేయనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
 
వూట్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌ విభాగ అధిపతి ఆకాశ్‌ బెనర్జీ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో వీడియో ఆన్‌ డిమాండ్‌ వ్యాపారాలకు మెజారిటీ ఆదాయం ప్రకటనల ద్వారానే సమకూరుతోందని, భవిష్యత్‌లో సబ్‌స్ర్కిప్షన్‌ రెవెన్యూ భారీగా పెరగనుందన్నారు. 

ఈ సందర్భంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇండియా కంటెంట్‌ విభాగ అధిపతి విజయ్‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ ‘భారత్‌లోని అన్ని వర్గాల వారు సినిమాలను ఇష్టపడతారు.

కాబట్టి వారికి ఎప్పటికప్పుడు తాజా సినిమాలను అందుబాటులోకి తేవడం మాకెంతో కీలకం. స్వీయ అధ్యయనాలు, సోషల్‌ మీడియా ద్వారా వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్న సినిమాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాం’ అని తెలిపారు. 
 
పీడబ్ల్యూసీ ఇండియా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగ అధిపతి రాజీబ్‌ బసు ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రపంచంలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోన్న దేశాల్లో భారత్‌ ఒకటి. భవిష్యత్‌లో ఓటీటీ సేవల విభాగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకోనుంది’ అని చెప్పారు.

ఓటీటీ సేవలు వేగంగా వృద్ధి చెందుతున్నా సంప్రదాయ కేబుల్‌, శాటిలైట్‌ టీవీ చానళ్ల హవా మున్ముందు కూడా కొనసాగుతుందని వినోద రంగ వర్గాలు అంటున్నాయి. గత ఏడాది పే టీవీ సేవల ఆదాయం రూ.70,000 కోట్ల (1,000 కోట్ల డాలర్ల)కు చేరుకుంది. 2023కల్లా 1,759 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. 

2023కల్లా భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ అడ్వర్టైజ్‌ మార్కెట్‌గా అవతరించనుందని పీడబ్ల్యూసీ అంటోంది. టీవీ అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌ ఏటేటా 10.7 శాతం వృద్ధితో వచ్చే నాలుగేళ్లలో 680 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా.
 
‘ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌’ రివార్డు పథకంలో భాగంగా తమ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ సేవలకు మూడు నెలల ఉచిత సబ్‌స్ర్కిప్షన్‌ కల్పిస్తున్నట్లు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తెలిపింది. రూ.1,099 ఆపై ప్లాన్‌ వినియోగదారులకు ఈ ఆఫర్‌ అందిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌తోపాటు జెడ్‌ఈఈ5, ఎయిర్‌టెల్‌ ప్రైమ్‌ వీడియో కంటెంట్‌కు సైతం యాక్సెస్‌ లభించనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ప్రస్తుతం హాట్ స్టార్, జియో టీవీ, బిగ్ ఫ్లిక్స్, జియో సినిమా, వయాకామ్ 18, వొడాఫోన్ ప్లే, ఎయిర్ టెల్ టీవీ తదితర 40 ఓటీటీ కంపెనీలు సేవలందిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios