భారత్ లోని ప్రముఖ నగరాల్లో.. ఎక్కడ చూసినా మసాజ్ సెంటర్లు కనిపిస్తున్నాయి. కాలంతోపాటు పరిగెత్తే ఉద్యోగాలు చేస్తూ.. ఒత్తిడికి గురౌతున్నవారు కూడా ఆ మసాజులు చేయించుకునేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఆ మసాజ్లకు థాయిలాండ్ పెట్టింది పేరు. అందుకే అక్కడి నుంచి మసాజ్ చేసే అమ్మాయిలను మన దేశానికి తీసుకొని వస్తున్నారు. ఇది నిన్నటి వరకు మనకు తెలిసిన కథ. కానీ దాని వెనుక చాలా మందికి తెలియని వ్యవహారం నడుస్తోంది.. అదే వ్యభిచారం.

పేరుకు మసాజ్ సెంటర్లు.. లోపల మాత్రం వ్యభిచారం చేయిస్తున్నారు. ఇటీవలే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదాయం కోసం..తమకు తెలిసిన విద్యను ఉపయోగించి పొట్ట నింపుకుందామని థాయ్ లాండ్ కి చెందిన మహిళలు.. భారత్ కి వస్తున్నారు. వారి అవసరాన్ని గుర్తించిన పలువురు మాత్రం.. వారిని వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు.

ముంబయి, పూణె నగరాల్లో..  ఇటీవల పోలీసు అధికారులు మసాజ్ పార్లర్ లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో.. వ్యభిచారం చేస్తూ దాదాపు 40మంది థాయిలాండ్  కి చెందిన యువతులు దొరికారని  పోలీసులు చెప్పారు. భారత్ లో థాయ్ మసాజ్ కి డిమాండ్ ఎక్కువగా  ఉందని బాలల సంరక్షణ ప్రొగ్రామ్ డైరెక్టర్ జ్యోతి నలే తెలిపారు. అంతేకాకుండా వారి చర్మ రంగు తెల్లగా ఉండటంతో.. వారిని ఉపయోగించి ఈ పార్లర్ యజమానులు ఎక్కువ ఆర్జిస్తున్నారని  ఆయన తెలిపారు.

గత నెలలో పూణెలోని ఓ పార్లర్ లో దాదాపు 10మంది థాయ్ అమ్మాయిలను పోలీసులు రక్షించారు. కేవలం థాయిలాండ్ మాత్రమే కాకుండా.. నేపాల్ , బంగ్లాదేశ్  దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని వారు చెప్పారు.

విదేశీయులే కావాలని ఇక్కడి వారు కోరడంతో.. పార్లర్ యజమానులు బలవంతంగా ఆ అమ్మాయిలను ఈ రంగంలోకి దింపుతున్నారని పోలీసులు  చెబుతున్నారు. ఆ అమ్మాయిలు మరీ ఉన్నత చదువులు కూడా చదివిన వారు కాదని.. పేదరికంలో పెట్టి.. కుటుంబ పోషణ కోసం దేశాన్ని వదిలి వచ్చిన వారని చెప్పారు. అందులోనూ 25 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

ఓ పార్లర్ లో తాము కొందరు అమ్మాయిలను రక్షించామని.. వారి వద్ద రూ.లక్ష వరకు డబ్బు ఉందని.. ఆ మొత్తాన్ని వారు కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లోనే సంపాదించగలుగుతున్నారని తెలిపారు.