యూకే యంగెస్టు మిలీనియర్ గా భారత సంతతి కుర్రాడు 16నెల్లలో రూ.100కోట్లకుపైగా సంపాదించిన అక్షయ్ ‘డోర్‌స్టెప్స్‌.కో.యూకే’ వెబ్‌సైట్‌ ని ప్రారంభించిన అక్షయ్

19ఏళ్ల కుర్రాడు అంటే.. బుద్ధిగా కాలేజీకి వెళ్లి చదువుకుంటూ.. అప్పుడుప్పుడూ స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ గడుపుతారు. ఇంతకు మించి వారి దగ్గరి నుంచి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఆ వయసులో కనీసం వారు డిగ్రీ కూడా పూర్తి చేయలేరు. కానీ ఓ కుర్రాడు మాత్రం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.100కోట్లకు పైగా సంపాదించాడు. అది కూడా సంవత్సరం తిరిగే లోపు. అతనే అక్షయ్ రూపారెలియా.

భారత సంతతికి చెందిన అక్షయ్‌ రూపారెలియా(19) అత్యంత పిన్నవయసులో బ్రిటన్‌ కోటీశ్వరులైన వారిలో ఒకరిగా నిలిచారు. కేవలం 16 నెలల్లోనే తన వ్యాపారాన్ని (ఆన్‌లైన్‌ స్థిరాస్తి సంస్థ) 12 మిలియన్‌ పౌండ్ల (రూ. 103 కోట్లకు పైగా)కు చేర్చడం ద్వారా అక్షయ్ ఈ ఘనతను సాధించారు.

 ఒక వైపు కాలేజీకి వెళ్లి చదువుకుంటూనే అక్షయ్ ‘డోర్‌స్టెప్స్‌.కో.యూకే’ వెబ్‌సైట్‌ ని ప్రారంభించాడు. కేవలం 16నెలల్లో తన వెబ్ సైట్ ని యూకేలో 18వ అతిపెద్ద స్థిరాస్తి సంస్థగా నిలబెట్టాడు. ఇఫ్పటివరకు అక్షయ్ 100 మిలియన్ పౌండ్ల స్థిరాస్తుల అమ్మకాలను జరిపాడు.

బంధువుల నుంచి అప్పుగా తెచ్చిన 7 వేల పౌండ్లను (సుమారు రూ. 6.02 లక్షలు) అతను పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు అతనే 12మందికి స్వయంగా తన సంస్థలో ఉద్యోగం కల్పించాడు.

తాను వెబ్ సైట్ ప్రారంభించిన కొన్ని వారాలకే.. తన ఇంటిని అమ్మిపెట్టాలంటూ ఓ వ్యక్తి తనను సంప్రదించాడని అక్షయ్ తెలిపాడు. ఆ ఇళ్లు ఉన్న ప్రాంతానికి తన అక్క బాయ్ ఫ్రెండ్ అతని కారులో తనని తీసుకొని వెళ్లాడని.. అప్పుడు ఆ ఇంటి ఫోటోలు తీసుకోగలిగానని చెప్పాడు. అందుకు తన అక్క బాయ్ ఫ్రెండ్ కి 40పౌండ్లు ఇచ్చానని తెలిపాడు. అప్పటికి తాను కారు డ్రైవింగ్ టెస్టు పాసు కాలేదని.. సొంత కారు కూడా లేదని వ్యాపారం మొదలు పెట్టిన రోజులను గుర్తు చేసుకున్నాడు.

వ్యాపారం మొదలు పెట్టిన రోజుల్లో ఒక కాల్ సెంటర్ ని హైర్ చేసుకున్నాడు. తన వెబ్ సైట్ కి వచ్చే కాల్స్ ని వాళ్లే రిసీవ్ చేసుకొని సమాధానాలు చెప్పేవారు. తన స్కూల్ అయిపోయి తిరిగి వచ్చాక.. మళ్లీ ఆ కాల్స్ అక్షయ్ రిసీవ్ చేసుకొని.. వారికి సమాధానమిచ్చేవాడు.

యూకేలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ మదర్స్ ఎక్కువ మంది ఉంటారు. వారికి స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు లక్ష్యంగా చేసుకొని తన వ్యాపారాన్ని అక్షయ్ అభివృద్ధి చేసుకున్నాడు. ఈ మదర్స్ అంతా.. ప్రాపర్టీస్ విషయంలో ఎంతో నిజాయితీగా.. అన్నీ నిజాలే చెప్పేవారని అది చాలా ముఖ్యమని.. అందువల్లనే తాను ఇంత సాధించగలిగానని అక్షయ్ తెలిపాడు. చాలా మంది ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమయ్యే వారి ప్రాపర్టీలను అమ్మేవారని అతను వివరించాడు.

 అంతేకాదు.. ఆర్థిక, గణిత శాస్త్రాల్లో చదువుకోవడానికి ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్శిటీ నుంచి అవకాశం వచ్చినప్పటికీ అక్షయ్‌ తన వ్యాపారాన్ని విస్తరించడానికే నిర్ణయించుకున్నాడు. ఇటీవలే తన సొంత డబ్బులతో అక్షయ్.. మొట్టమొదటి కారు కొనుగోలు చేశాడు.

ఇక అక్షయ్ కుటుంబ వివరాలకు వస్తే.. అతని తల్లిదండ్రులు ఇద్దరూ చెవిటి వాళ్లు. తండ్రి కౌషిక్(57) కేర్ వర్కర్, తల్లి రేణుక.. చెవిటి విద్యార్థులకు టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేసేవారు. అక్షయ్.. ఎదుగుదలను చూసి వారి తల్లిదండ్రులు ఎంతో గర్వంగా ఫీలౌతున్నారు.