యూఎస్ వెళ్లి.. అక్కడ స్థిరపడాలని చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కలలు కంటారు. హెచ్ 1బీ వీసా సహకారంతో మొన్నటి వారకు వారి కల త్వరగానే సాధ్యమయ్యేది. ఎప్పుడైతే ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు అయ్యాడో.. ఆ నాటి నుంచి హెచ్ 1బీ వీసా విధానంలో ఆంక్షలు విధించారు. అమెరికాలోని ఉద్యోగాలన్నీ.. అమెరికన్లకే దక్కాలనే నిబంధన కూడా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అమెరికా వెళ్లడం కాస్త కష్టతరంగా మారింది. అయితే.. కొన్ని నైపుణ్యాలు ఉంటే.. ఏ దేశీయులైనా అమెరికాకు రావచ్చని ట్రంప్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

 ఇటీవల ‘‘ చెత్త దేశాల వలసలు’’ మాకొద్దంటూ.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. నైపుణ్యం, ఉద్యోగం, అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం ఉన్నవారు ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా తమ దేశానికి వలస రావొచ్చంటూ ట్రంప్‌ ప్రభుత్వంలోని ఓ అధికారి తెలిపారు. వీసా జారీల్లో ప్రతిభ ఆధారిత విధానం ఇలాగే ఉంటుందని చెప్పారు. ఇలాంటి పాలసీ గనుక అమల్లోకి వస్తే భారత్‌ లాంటి దేశాలకు చెందిన వ్యక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వలసల విధానంలో సంస్కరణలు చేపట్టాలని ట్రంప్‌ సర్కార్‌ భావిస్తోందని సదరు అధికారి పేర్కొన్నారు.