పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై ఆయన మాజీ భార్య రెహామ్ పలు ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ పచ్చి మోసగాడని ఆమె ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ఇటీవల మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మత బోధనలు చేసే బుష్రా మనేకాను ఇమ్రాన్  పెళ్లి చేసుకున్నట్లు ఇటీవల ప్రకటించారు. కాగా.. ఈ వివాహంపై ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ స్పందించారు.

తాను ఇమ్రాన్ తో 2015లో విడిపోయినట్లు చెప్పారు. తనను పెళ్లి చేసుకున్న నాటి నుంచి మోసగిస్తూనే వచ్చినట్లు తెలిపారు. మనేకాతో అతని వివాహం జనవరిలోనే జరిగిందని.. మీడియాకి మాత్రం ఇప్పుడు చెప్పాడని ఆమె అన్నారు. తనను వివాహం చేసుకున్న సమయంలో కూడా.. పెళ్లి జరిగిన రెండు నెలల వరకు ఎవరికీ తెలియనివ్వలేదని గుర్తు చేసుకున్నారు. ఇమ్రాన్ తో తన వైవాహిక జీవితం ఎలాగడిచిందో ఓ పుస్తకం రాస్తున్నట్లు ఆమె చెప్పారు.