Asianet News TeluguAsianet News Telugu

మృగశిర కార్తె ప్రాముఖ్యత ఏమిటీ..?

మృగశిర కార్తె ప్రాముఖ్యత ఏమిటీ..?

importance of mrugasira karthi

భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతువపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు.. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలుపెడతారు. 

ఎలా ప్రారంభమవుతుంది..?
చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు.. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే.. ఆ కార్తెకు ఆ పేరు పెడతారు... అశ్వినితో ప్రారంభమై రేవతీతో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. 

మృగశిర కార్తెను ఎలా జరుపుకోవాలి..?
మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి.. వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు/ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం..

పురాణ ప్రాశస్త్యం:
వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తును బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. ఈ కార్తె ప్రాధాన్యత మనకు భగవద్గీతలోనూ కనిపిస్తుంది.. తొలకరి జల్లుల అనంతరం ధరణి నుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ సమయంలో వాతావరణ ఆహ్లాదకరంగా ఉండి మానవునిలో ఓజస్సు, తేజస్సు మృగశిర కార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడనే ప్రాచీన వైద్యుడు.. తన గ్రంథాల్లో వివరించాడు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రోజున ఆధ్యాత్మిక చింతనతో గడిపి భగవంతుడి ఆశీర్వాదాలు పొందగలరు..

చేప మందు పంపిణీ:
అస్తమా బాధితులకు అందించే చేప మందును కూడా ప్రతీ ఏడాది ఇదే రోజున బత్తిన సోదరులు పంపిణీ చేస్తూ వస్తున్నారు. వీరి పూర్వికులకు 1845లో ఓ మునీశ్వరుడు అస్తమా మరియు ఇతర శ్వాస  సంబంధిత రోగాల నివారణకు ఔషద గుణాలు కలిగిన ప్రసాదాన్ని తయారుచేసే రహస్యం భోదించారు.. అతి ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ రోజునే రోగులకు ఇవ్వాలని ఆ రుషి తెలిపారట. నాటి నుంచి నేటి వరకు 175 సంవత్సరాల నుంచి నిరాంతరాయంగా ఈ చేప మందు పంపిణీ జరుగుతూ వస్తోంది. దీనిని తీసుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి అస్తమా రోగులు హైదరాబాద్‌కు తరలి వస్తుంటారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios