హైకోర్టు జడ్జీ సీవీ నాగార్జునరెడ్డి పై వెల్లువెత్తిన ఆరోపణలు దళిత జడ్జీని కులంపేరుతో దూషించినట్లు ఫిర్యాదు అభిశంసన ద్వారా తొలగించాలని రాజ్యసభలో ఎంపీల పిటిషన్

ఓ దళిత జడ్జీని కులంపేరుతో దూషించడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఉమ్మడి హైకోర్టు జడ్జీ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి పై అభిశంసన పిటిషన్ దాఖలైంది.

61 మంది ఎంపీలు అతడిపై అభిశంసన తీర్మానం చేపట్టి పదవి నుంచి తొలగించాలని రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారీని రాతపూర్వకంగా కోరారు.

ఈ పిటిషన్‌పై ఏచూరితోపాటు సీపీఐ సీనియర్‌నేత డి.రాజా, జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు దిగ్విజయ్‌సింగ్‌, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ పీఎల్‌ పునియా, కేంద్రమాజీ మంత్రి కుమారి షెల్జా, తెలంగాణ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 61 మంది ఎంపీలు సంతకాలు చేశారు.

పిటిషన్‌ను స్వీకరించిన రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ దాన్ని పరిశీలించి, అందులోని సంతకాలను రూఢి చేసుకున్నారు. చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తానని హామీ ఇచ్చారు.

దీనికంటే ముందు పిటిషన్‌లోని అంశాలపై ముగ్గురు సభ్యులతో కమిటీ ద్వారా విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని ప్రకటించారు.

రాయచోటిలో న్యాయమూర్తిగా పనిచేసిన ఎస్‌.రామకృష్ణ అనే దళితుడిని కులం పేరుతో దూషించి, భౌతికంగా దాడి చేశారని జస్టిస్ నాగార్జున రెడ్డిపై ప్రధానంగా వచ్చిన ఆరోపణ.

అంతేకాకుండా ఆదాయినికి మించి ఆస్తులను కూడాబెట్టారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

మొదటి తెలుగు జడ్జీ..

హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీలను తొలగించడం అనేది రాజ్యాంగాన్ని అనుసరించి చేసే ప్రక్రియ. అర్టికల్ 124(4) అధికరణ ఇందుకు వీలు కలిపిస్తుంది.

ఉభయసభల్లో చర్చ జరిగి ఆరోజు ఓటింగుకు హాజరైన వారిలో 2/3వంతు మంది ఓటేయాల్సి ఉంటుంది. తర్వాత అదే సమావేశకాలంలో దాన్ని రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అభియోగాలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని తొలగించడానికి వీలవుతుంది. 

రామస్వామి, సౌమిత్రిసేన్ తర్వాత ..

అవినీతి ఆరోపణలతో గతంలో పశ్చిమబెంగాల్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సౌమిత్రి సేన్‌ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. రాజ్యసభలో తీర్మానం నెగ్గిన అనంతర లోక్ సభలో చర్చించే లోపే ఆయన రాజీనామా చేశారు.

అంతకుముందు తమిళనాడుకు చెందిన జస్టిస్‌ వి.రామస్వామి కూడా అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఆయన కూడా విచారణకు ముందే రాజీనామా చేశారు.

ఇప్పుడు తొలిసారిగా ఒక తెలుగు జడ్జీ సీవీ నాగార్జునరెడ్డి అభిశంసన ఎదుర్కోబోతున్నారు.