ఐఐటీలో పెరుగుతున్న బాలికల సంఖ్య నేలపైనే నిద్రిస్తున్న బాలికలు తల్లిదండ్రుల  ఆగ్రహం

ఐఐటీలలో పరిస్థితి మారుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఐఐటీలో చదివే బాలికల సంఖ్య చాలా
 తక్కువగా ఉండేంది. ఇప్పుడు అలా లేదు. బాలురకు ధీటుగా బాలికలు ముందంజలో నిలుస్తున్నారు.
 గత రెండు మూడు సంవత్సరాలుగా ఐఐటీలో చదివే బాలికల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కానీ వారికి 
తగట్టుగా యాజమాన్యం సౌకర్యాలు కల్పించడంలో విఫలమౌతోంది. కనీసం పడుకోవడానికి మంచాలు 
కూడా ఏర్ఫాటు చేయలేకపోతోంది. ఇందుకు నిదర్శనమే దిల్లీ ఐఐటీ.

ఈ సంవత్సరం దిల్లీ ఐఐటీలో 30శాతం మంది బాలికలకు అదనంగా ఐఐటీలో అడ్మిషన్ లభించింది. 
కానీ ప్రస్తుతం దిల్లీ ఐఐటీలో వసతుల లేమి నెలకొంది. బాలికలకు సరిపడా రూమ్స్ కూడా లేవు. దీంతో వారిని
అసోసియేటివ్ ప్రొఫెసర్స్ కోసం ఏర్పాటు చేసిన మరో భవనంలో ఉండాల్సిందిగా యాజమాన్యం కోరుతోంది.

 అంతేకాకుండా సరిపడ మంచాలు కూడా లేకపోవడంతో వారిని నేలపై పడుకోవాల్సిందిగా అధికారులు 
సూచించారు. దీనిపై బాలికల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఈ విషయంపై 
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా.. కొత్తగా చేరిన 
విద్యార్థుల కోసం మంచాలు ఆర్డర్ చేశామని.. అవి త్వరలో వస్తాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

అయితే.. ఈ ఏడాది అదనంగా 30శాతం మంది బాలికలకు యూజీ, మాష్టర్ కోర్సులు చదివేందుకు

ఐఐటీలో చేరారని.. దీంతో వారికి వసతి కల్పించడం ఇబ్బందిగా మారిందని సీనియర్ ఐఐటీ అధికారి

ఒకరు తెలిపారు. ప్రత్యామ్నాయంగా వారిని వేరే భవనంలో ఉంచినట్లు ఆయన చెప్పారు.