ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లపై స్మార్ట్ ఫోన్ కంపెనీల ఫిర్యాదు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లు ఎప్పటికప్పుడు ఏదో ఒక డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటిస్తూనే ఉంటాయి. ఆ డిస్కౌంట్ ఆఫర్ లో స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీ తగ్గింపు కూడా ప్రకటిస్తూ ఉంటాయి. కష్టమర్లను ఆకట్టుకునేందుకు అవి అలా చేస్తూ ఉంటాయి. అయితే.. అలా డిస్కౌంట్లు ప్రకటించడమే ఆ సంస్థలకు తలనొప్పిగా మారింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని దేశీయ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా డిస్కౌంట్లు ప్రకటించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని సదరు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై చర్యలు తీసుకోవాలని ఇండియన్‌ సెల్యులార్‌ అసెసియేషన్‌(ఐసీఏ) కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రి సురేశ్‌ ప్రభును కోరింది.

ఈ విషయమై ఐసీఏ ప్రతినిధులు ఇటీవల సురేశ్‌ ప్రభును కలిసి ఫిర్యాదు చేశారు. సదరు సంస్థలు డిస్కౌంట్ల పేరుతో ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలను ప్రభావితం చేస్తున్నాయని, తద్వారా ఎఫ్‌డీఐ ప్రెస్‌ నోట్‌-3 కింద ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఐసీఏ ఫిర్యాదు చేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ చర్యల వల్ల రిటైలర్ల ఆదాయానికి గండి పడటమేగాక.. 6 కోట్ల మంది ఉద్యోగాలు రిస్క్‌లో ఉంటున్నాయని ఆరోపించారు. యాపిల్‌, మైక్రోమాక్స్‌, నోకియా, వివో, లావా, మోటొరోలా తదితర కంపెనీలు ఐసీఏ ద్వారా ఈ ఫిర్యాదులు చేశాయి.

అయితే ఈ ఆరోపణలను అమెజాన్‌ తోసిపుచ్చింది. భారత చట్టాలు, నిబంధనలకు అమెజాన్‌ కట్టుబడి ఉంటుందని, వాటికి అనుగుణంగానే కార్యకలాపాలు నిర్వహిస్తోందని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. తమ వెబ్‌సైట్లో పెట్టిన ధరలు పూర్తిగా విక్రయదారులు నిర్ణయించినవే అని స్పష్టం చేసింది. కాగా.. ఈ ఘటనపై ఫ్లిప్ కార్ట్ ఇంకా నోరు విప్పకపోవడం గమనార్హం.