చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రాన్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. ఇటీవల భారత మార్కెట్లోకి రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్5 ప్రో పేరిట రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లను రెండు సార్లు ఆన్ లైన్ లో విడుదల చేయగా.. రెండు సార్లు అతి తక్కువ సమయంలో ఫోన్లన్నీ అమ్ముడయ్యాయి. దీంతో.. ఫోన్లు కొనడంలో విఫలమైన వారు చాలా మంది  నిరాశకు గురయ్యారు.కాగా.. అలాంటి వారికి కంపెనీ ఓ శుభవార్త తెలియజేసింది.

ఈ స్మార్ట్‌ ఫోన్లను ఇక మీదట ఆఫ్‌లైన్‌ ద్వారా కూడా ముందస్తు బుకింగ్స్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే.. ముందస్తు బుకింగ్‌ చేసుకోవాలంటే అసలు ధర కంటే రూ.500 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 8 నుంచి ఆఫ్‌లైన్‌లో ముందస్తు బుకింగ్స్‌ చేసుకున్న వారికి స్మార్ట్‌ ఫోన్లను డెలివరీ చేయనున్నారు. రెడ్‌మీ ఆఫ్‌లైన్‌ రిటైల్‌ పార్టనర్స్‌ ద్వారా ఈ స్మార్ట్‌ ఫోన్లను ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు.

రెడ్‌మీ నోట్‌ 5 ధర ఆన్‌లైన్‌లో రూ.9,999(3జీబీ ర్యామ్‌/ 32జీబీ మెమరీ) ఉండగా దాని ధర ఆఫ్‌లైన్‌లో రూ.10,499గా ఉండనుంది. అదే విధంగా నోట్‌ 5 మరో వేరియంట్‌ ధర రూ.11,999(4జీబీ ర్యామ్‌/ 64జీబీ మెమరీ) ఉండగా.. ఆఫ్‌లైన్‌లో రూ.12,499 చెల్లించాల్సి ఉంటుంది.