ఎక్కడైనా పండగ మొదలౌతోంది అంటే.. సందడి మొదలౌతుంది. వచ్చిపోయే చుట్టాలు, పిండి వంటలు, పిల్లల ఆటపాటలతో కళకళ లాడుతుంటాయి. కానీ.. హైదరాబాద్ నగరం మాత్రం వెలవెలబోతోంది. ఇప్పటికే పలు విద్యా సంస్థలు, ఆఫీసులకు సంక్రాంతి సెలవలు ప్రకటించారు. దీంతో.. అందరూ ఒక్కసారిగా సొంతూళ్లకు పయనమయ్యారు. ఇప్పటికే సగం నగరం ఖాళీ అవ్వగా.. శని, ఆదివారాల్లో మరో 30శాతం నగరం ఖాళీ కానుంది.

పండగ సందడంతా హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వే స్టేషనలలో మాత్రమే కనపడుతోంది. ఎందుకంటే.. వీరంతా ఊర్లకు వెళ్లడానికి అక్కడికి చేరుకున్నారు. కొందరు ముందు జాగ్రత్తగా ముందే రిజర్వేషన్లు చేసుకోగా.. మరికొందరేమో.. అప్పటికప్పుడు ఊళ్లకు వెళ్లేందుకు బయలుదేరారు. దీంతో.. బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ.. రద్దీ అదేవిధంగా కొనసాగుతుంది.

గురువారం నుంచే నగర ప్రజల ప్రయాణాలు ప్రారంభం అయ్యాయి. కాగా.. వాళ్లు మళ్లీ తిరిగి నగరంలో అడుగుపెట్టడానికి దాదాపు మరో నాలుగు రోజులైనా పడుతుంది. అంటే.. మళ్లీ మంగళవారం సాయంత్రం అందరూ తిరిగి నగర బాట పడతారు. అప్పటి వరకు రోజూ రద్దీగా ఉండే నగర రోడ్లు ఖాళీగా ఉంటాయి. 

 దీనికి కారణం, సంక్రాంతి విశిష్టత. అన్ని పండగలకు హైదరాబాద్ లో స్థిరపడిన  లక్షలాది మంది ఆంధ్ర ప్రాంతీయులు తమ వూర్లకు వెళ్లినా అది తప్పని సరికాదు. అయితే, సంక్రాంతికి సొంతవూరికి చేరుకుని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో గడిపి తీరాలనుకోవడం  విశేషం. అందుకే సంక్రాంతి వూరంతా పండగ. సామూహిక సంబరం. అచ్చ తెలుగు ఆనందం, వినోదం, ఆహ్లాదం.(ఫోటోలు గత పండగవి)