ప్రస్తుతం నడుస్తున్న ఈ అపార్ట్ మెంట్ సంస్కృతిలో మొక్కలను పెంచే స్థలం ఎక్కడ ఉంది? ఇదే కదా మీ ప్రశ్న. మనసుంటే మార్గం ఉంటుంది. మొక్కలను పెంచడానికి పెద్దగా ఖాళీ స్థలం అవసరం లేదు. మనకు వాటిని పెంచాలనే కోరిక ఉంటే చాలు.

ప్రతి రోజూ సాయంత్రం.. అలా కొద్ది సేపు పార్క్ కి వెళితే.. చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండే మొక్కలు.. స్వచ్ఛమైన గాలి చాలా ప్రశాంతతని కలిగిస్తుంది. అందుకే మనలో చాలా మంది పార్కులకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అయితే.. ప్రశాంతత కోసం ఎక్కడో ఉన్న పార్క్ కే వెళ్లాల్సిన అవసరం లేదండి.. మన ఇంటినే ఓ అందమైన ఉద్యానవంగా మార్చుకోవచ్చు...

ప్రస్తుతం నడుస్తున్న ఈ అపార్ట్ మెంట్ సంస్కృతిలో మొక్కలను పెంచే స్థలం ఎక్కడ ఉంది? ఇదే కదా మీ ప్రశ్న. మనసుంటే మార్గం ఉంటుంది. మొక్కలను పెంచడానికి పెద్దగా ఖాళీ స్థలం అవసరం లేదు. మనకు వాటిని పెంచాలనే కోరిక ఉంటే చాలు.

ఇంట్లో పూల మొక్కలు ఉంటే చాలా అందంగా ఉంటుంది. కంటికి ఇంపుగా... మనసుకి ప్రశంతంగా ఉండేలా ఇంటిని చాలా సులభంగా మినీ గార్డెన్ చేయొచ్చు. అంతేకాదు.. ఈ మినీ గార్డెన్ మీ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ లా అందాన్ని చేకూరుస్తుంది. అదేలా అంటే...

1. మీ ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఏదైనా గాజు జాడీ ఉందా? లేదా ఏదైనా గాజు గిన్నె, పాత పూల కుండీ.. ఇలా ఏదైనా పర్వాలేదు వాటిల్లో కూడా మొక్కలు పెంచేయొచ్చు. ముందుగా అలాంటి గాజు జాడీని ఎంచుకోవాలి.

2. ఆ తర్వాత మట్టి తవ్వడానికి చిన్న పార ( మార్కెట్లో గార్డెనింగ్ టూల్స్ పేరిట లభ్యమౌతాయి), స్కూప్, చేతి గ్లౌజులు తెచ్చుకోవాలి.

3.మీ మిని గార్డెన్ లో ఎలాంటి మొక్కలను పెంచాలనుకుంటున్నారో వాటిని ఎంచుకోవాలి. మినీ ప్లాంట్స్, కాక్టి, సక్లెంట్స్ ( ఈ మొక్కలు కూడా ఇప్పుడు ఆన్ లైన్ లో లభిస్తున్నాయి) లాంటి మీ అభిరుచి కి తగిన మొక్కలను ఎంచుకోవాలి.

4.మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సిన మట్టి, చార్ కోల్ మిక్చర్( ఇవి కూడా ఇప్పుడు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి), శుభ్రమైన నీరు తీసుకోవాలి. అనంతరం మీకు నచ్చిన విధానంలో అందంగా డిజైన్ చేసుకొని మీరు ఎంచుకున్న మొక్కలను నాటుకోవచ్చు. అవసరం అనుకుంటే చిన్న చిన్న రాళ్లు కూడా చేర్చవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా వాటిల్లో అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలను కూడా పెట్టవచ్చు.

5.ఇలా తయారు చేసుకున్న మీ మిని గార్డెన్ ని ఇంట్లో మీకు నచ్చిన ప్రదేశంలో పెట్టుకోవచ్చు. మనసుకు ప్రశాంతత, కంటికి అందంగానూ ఉంటాయి. ఇంట్లో గార్డెన్ పెట్టుకోవాలనే మీ కోరిక కూడా నెరవేరుతుంది.