ఇది జైన సంప్రదాయం నుంచి వచ్చిందని ప్రముఖ పరిశోధకులు వైద్యంవేంకటేశ్వరాచార్యులు అంటున్నారు . ఎలాగో చదవండి

తుంగ భద్ర, హంద్రీ నదుల మధ్య ఉన్న కర్నూలుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా! అంటే, కొంత చరిత్ర తెలిసిన వారంతా తెలుసనే అంటారు. కందనవోలు నుంచి వచ్చిందంటారు. ఆ పేరు ఏర్పడానికి కారణాలు రెండు చెప్తారు. కందెన కారణంగా అనే వాదం ఒకటి , కాగా స్కందనాగుని పేర అనేది రెండోవాదం.కందెనవాదం పూర్వంనుంచీ ప్రచారంలో ఉంది. స్కందనాగుని కారణం మా ఆత్మీయులు గౌరవనీయులు బ్రహ్మశ్రీ గడియారంరామకృష్ణశర్మగారు ప్రప్రథమంగా చెప్పారు.

తెలంగాణలోని నాగరకర్నూలు కూడ స్కందనాగుని పేరనే వచ్చిందని గడియారంవారి మాట.గడియారంవారికన్నాముందు స్కందనాగునివాదం లేదు. నాగన ,కందన అనే సోదరులు ఉండేవారు. నాగన్న కట్టిన ఊరుకు నాగనప్రోలు అనీ,కందన కట్టిన ఊరుకు కందనప్రోలు అనీ, ఆ రెండు ఊర్లూ కలిసిపోయి నాగనకందనప్రోలు అనే పేరు ఏర్పడింది. ఆ ఊరు వృద్ధికావడంతో నాగరకందనప్రోలుగా మారింది.వ్యవహారంలో నాగర్ కర్నూల్ గా నిలిచింది. ఈ విషయాన్ని నాగరకర్నూల్ వాసీ, సుప్రసిద్ధ చారిత్రక సాహిత్య పరిశోధకుడు శ్రీ కపిలవాయి లింగమూర్తిగారు ప్రామాణిక ఆధారాలతో సిద్ధాంతీకరించారు. ఈ విషయాలు కపిలవాయిగారికుమారుడు- కిశోర్ బాబుగారు.

ఆచార్యబిరుదురాజురామరాజుగారి పర్యవేక్షణలో ఉస్మానియా విశ్వవిద్యాల‌యానికి సమర్పంచిన పరిశోధన గ్రంథం నాగర కర్నూలు తాలూకా గ్రామనామాలు-చరిత్ర అనే గ్రంథంలో కూడా వివరంగ ఉన్నాయి(ముద్రణ-2011).దీనినిబట్టి గడియారంగారు నాగర కర్నూలు కూడా స్కందనాగుని పేర ఏర్పడిందనే వాదం వీగిపోయింది.ఇక మన కర్నూలు కూడా స్కందనాగుని పేర ఏర్పడ లేదు.

 పూర్వం అలంపూరు , కందనవోలూ ప్రాంతమంతా జైనమత ప్రాబల్యం ఎక్కువ.అలంపురంపూర్వం జైనక్షేత్రమని బ్రహ్మేశ్వరపురాణము అనే పద్యకావ్యానికి వ్రాసిన విపులమైన పీఠికలో సురవరంప్రతాపరెడ్డిగారు ప్రిమాణికంగా నిరూపించారు. అక్కడ వెలసిన జైనజోగిని తదనంతరకాలాన జోగులాంబగ ప్రాచుర్యం పొందిందని సురవరంవరంవారు ఆ పీఠికలో చెప్పారు. ఇక కర్నూలు విషయం. ఈ ప్రాంతమంతాకూడా జైన ప్రాబల్యం అధికంగాఉండేది.కర్నూల్లో జైనతీర్థంకరంల విగ్రహాలు ఉండేవి. కర్నూలు చెన్నరాష్ట్రంలో ఉన్నపుడు కర్నూల్లోని జైనతీర్థంకరుల విగ్రహాలు మద్రాస్ లోని మ్యూజియానిక చేరాయి. ఈ విషయాన్ని మన హీరాలాల్ గారుకూడా ఒక వ్యాసంలో పేర్కొన్నారు. నేటికీ చెన్నైలోని మ్యూజియంలో కర్నూల్ నుండి తరలించిన జైనతీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి.కర్నూల్ కు సమీపాన జైనుల బసతి/వసతి ఉండేది.అది పాడుబడ్డాక కూడా బసతిపాడు అని పేర్కొన్నారు.

అదే నేటి బస్తిపాడు. గ్రామనామాల ఉత్తరవిశేషణం పాడు అని ఉండేవన్నీ జైనుల ఆవాసాలని పూర్వ పరిశోధకులు చెప్పిన మాటల్లో అభిప్రాయభేదాలులేవు.కర్నూలుకు సమీపాన ఉండే పందిపాడు,దూపాడు , దొడ్డిపాడు, యాపర్లపాడు,కొంగనపాడు, దిన్నెదేవరపాడు, పడ్దెంపాడు,కొంతలపాడు మొదలైన గ్రామ నామాలు అలాంటి వాటికి కొన్ని ఉదాహరణలు. జైనం క్షీణ దశలో కొన్నిగ్రామాలు చాలా పూర్వం లంజల పాలయ్యాయని అంటారు.లంజబండ,లంజ పోలూరు గ్రామాలు కర్నూల్ కు దగ్గరి గ్రామాలే. కర్నూలుకు సమీపంలోని జగన్నాథంగట్టు మీద ఉండే గుండంపై శిలాశాసనంలో వేశ్యానగరం అనే పేరు కనబడుతుంది.లంజపోలూరుకు అది సంస్కృతీకరణరూపం.

జైనసన్యాసులు కొండగుహలలో నివసించేవారు.జగన్నాథంగట్టు పై ప్రస్తతమున్న గుహాలయం లాంటిదే. కాలప్రవాహంలో మార్పులు చేర్పలు జరగడం అనివార్యం,సత్యం.

 ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అలంపూరు, కర్నూలు పరిసరప్రాంతాలలో పూర్వం జైనమతం బాగా ప్రబలంగ ఉండేదనేందుకు సాక్ష్యాలుగ ఉన్నవి కనుక. కందన పల్లె,కందనప్రోలు అనే పేరు కలుగటానికి కూడ ఇక్కడ పూర్వం ఉండిన జైన సంప్రదాయాలే కారణం.స్కందనాగుడికీ కర్నూలు పేరుకూ ఏమాత్రం సంబంధంలేదు. జైన సంప్రదాయం మేరక ఇక్కడ జరుపుకున్న ఒక సంస్కృతి పేరున కందనపల్లె/ కందనోలు పేరు ఏర్పడి బ్రిటిష్ వారి కాలాన చివరకు కర్నూల్ అని నిలిచిపోయింది.

వీలును సరైన సందర్భాన్నిబట్టి ప్రామాణిక పరిశోధకుల సమక్షంలో అసలైన కారణం వెల్లడిస్తాను.

(* వైద్యంవేంకటేశ్వరాచార్యులు, టిటిడి పరిశోధకులు, కర్నూలు,9989679681)