ఇప్పటికీ పురుషులదే పై చేయిగా  ఉన్న  ప్రాంతాలెన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి తమిళనాడు లోని సేలం జిల్లా గత 170 సంవత్సరాల  నుంచి ఆ జిల్లాకు  వచ్చిన 170 మంది కలెక్టర్లు పురుషులే అలాంటి జిల్లాకి తొలిసారిగా ఓ 23ఏళ్ల యువతి కలెక్టర్ గా అడుగుపెట్టింది. ఆమెయే రోషిణి ఐఏఎస్

ఒకప్పుడు మహిళలు ఇంటి గడప దాటి బయటకు వచ్చేవారు కాదు. ఉద్యోగం అంటే పురుషులే చేయాలి అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే ఇప్పటికీ పురుషులదే పై చేయిగా అయిన ప్రాంతాలె న్నో ఉన్నాయి. వాటిలో ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా.

ఆ జిల్లాకి ఎంతో మంది కలక్టర్లు వచ్చారు.. వెళ్లారు.. కానీ అలా వచ్చి వెళ్లినవారంతా పురుషులే. గత 170 సంవత్సరాల నుంచి ఆ జిల్లాకు 170 మంది పురుషులు కలెక్టర్లుగా చేశారు. అలాంటి జిల్లాకి తొలిసారిగా ఓ 23ఏళ్ల యువతి కలెక్టర్ గా అడుగుపెట్టింది. ఆమె పేరు రోషిణి ఐఏఎస్.

మహారాష్ట్రలోని ఓ రైతు కుటుంబానికి చెందిన యువతి రోషిణి. ఆమె చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన మనసులో బలంగా నాటుకు పోయింది. దాని వల్లే ఆమె కలెక్టర్ అవ్వడానికి దారితీసింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపథకాలు రైతులకు అందడం లేదు. దాని కోసం పోరాడి ఓడిపోయారు అక్కడి రైతులు. వారిలో రోషిణి తండ్రి కూడా ఉన్నారు. ఆ సంఘటనకు ఆమె చలించిపోయింది. అప్పుడు రోషిణి వయసు 9 సంవత్సరాలు. ఈ వ్యవహారలన్నీ ఏ అధికారి చూస్తారు అని ఆమె వేసిన ప్రశ్నకు కలెక్టర్ అనే సమాధానం వచ్చింది. అంతే ఎప్పటికైనా తాను కలెక్టరయి రైతులకు న్యాయం చేయాలని బలంగా కోరుకుంది.

 ఆమె ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యనభ్యసించింది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఐఏఎస్ పాస్ అయ్యింది. 23 సంవత్సరాలకు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది. అంతక ముందు అడిషనల్ కలెక్టర్ గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించారు.

టీచరమ్మై పాఠాలు చెప్పిన రోషిణి..

ఆమె కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఒకసారి జిల్లాలోని గ్రామాల్లో పర్యటించింది. పర్యటనలో భాగంగా ఒక పాఠశాలకు వెళ్లగా.. అక్కడ విద్యార్థులంతా తరగతి గదిలో చదువుకోకుండా ఆడుకుంటూ కనిపించారు. ఏమని కలెక్టర్ ప్రశ్నించగా.. టీచర్లు ఇంకా రాలేదనే సమాధానం వచ్చింది. దీంతో ఆమె టీచర్ గా మారారు. 1,2,3 తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్, తమిళ పాఠాలు చెప్పారు. అనంతరం ఆ పాఠశాలలో విద్యార్థులకు సరైన ఉపాధ్యాయులను నియమించే బాధ్యత కూడా ఆమె తీసుకొని దానిని పూర్తి చేశారు.

ఆమె ఈ స్థాయికి రావడానికి ఇద్దరు పురుషులు రోషిణి వెన్నంటే ఉన్నారు. ఒకరు కన్న తండ్రి అయితే.. మరొకరు కట్టుకున్న భర్త. వీరిద్దరూ ఆమెకు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చేవారు. వారి సహకారంతో ఆమె మరింత ముందుకు సాగుతోంది. తండ్రి రైతు కాగా, భర్త మధురై ఎస్పీ విజయేంద్ర బిదారి.

తనకు సరిగా వంట చేయడం రాకపోయినా.. తన భర్త సర్దుకుపోతాడని.. ఆఫీసులో లేటు అయినా.. తన కుమారుడి బాధ్యతలు కూడా తన భర్తే చూసుకుంటాడని గర్వంగా చెప్పుకుంటుంది రోషిణి.