అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురిని ప్రేమించి లేపుకుపోయి పెళ్లి చేసుకున్న యువకున్ని ఓ తండ్రి హతమార్చాడు. తన పరువు తీసిందన్న ఆవేశంలో కూతురిని కూడా  హతమార్చడానికి దాడి చేశాడు. కానీ ఆమె తీవ్ర గాయాలతో బైటపడింది. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు కింది విదంగా ఉన్నాయి. 

అనంతపురం జిల్లా నల్లమడ మండలం బడవాండ్లపల్లికి చెందిన గిరిబాబు,కాటమ్మ దంపతుల కూతురు భార్గవి.  ఈ యువతి అదే గ్రామానికి చెందిన ధనుంజయ అనే యువకుడిని ప్రేమించింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోడంతో ఏడు నెలల క్రితం గ్రామం నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి ఆచూకీ తెలుసుకున్న భార్గవి తల్లి కూతురుని, అల్లున్ని ఇంటికి ఆహ్వానించింది. దీనికి అంగీకరించి పదిరోజుల క్రితం ఈ జంట  గ్రామానికి వచ్చారు.అయితే వీరి మీద భార్గవి తండ్రికి ఏమాత్రరం కోపం తగ్గలేదు. దీంతో తన పరువు తీసిన కూతురు, అల్లుడిని హతమార్చాలని పథకం పన్నాడు. సోమవారం అర్థరాత్రి గాఢ నిద్రలో వున్న ధనుంజయను ఈటతో గొంతులో పొడిచి హతమార్చాడు. అయితే అతడు అరపులతో భార్గవికి మెలకువ రాగా ఆమెపై కూడా దాడి చేశాడు. అయితే తీవ్ర గాయాలతో ఆమె తండ్రి దాడి నుండి బైటపడింది. దీంతో ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పరారీలో ఉన్న గిరిబాబు కోసం గాలిస్తున్నారు.