టీడీపీ పోలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ సమావేశం నేపథ్యంలో ఏపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ మొదలైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు లేకుండా తొలిసారి పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. దీనికి మంత్రి లోకేష్ అధ్యక్షత వ్యవహిస్తున్నారు. అయితే.. ఈ పోలిట్ బ్యూరో సమావేశానికి రేవంత్ రెడ్డి వస్తాడా? రాడా? అనే సందిగ్ధత ఉండేది. దానిని పటాపంచల్ చేస్తూ.. రేవంత్ సమావేశానికి హాజరయ్యారు. దాంతో.. టీడీపీ నేతల్లో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది.

రేవంత్ రెడ్డి పార్టీ  మారుతాడు అన్ని జరుగుతున్న ప్రచారమే ప్రధాన అంశంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో  టీడీపీకి సరైన పట్టు లేదు. దీంతో అక్కడ అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి.. పార్టీ అధిష్టానానికి చెడింది. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి బలం చేకూరుస్తూ రేవంత్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారు. అంతటితో ఆగకుండా ఏపీ ఆర్థిక మంత్రి యనమల, మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ల మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దీంతో ఒక్కసారి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వెడెక్కాయి.

ఇదిలా ఉండగా.. లోకేష్ అధ్యక్షతన శుక్రవారం పోలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశంలో రేవంత్ ఏమి మాట్లాడతారు? రేవంత్ చేసిన ఆరోపణల గురించి లోకేష్ వివరణ అడుగుతారా? అడిగితే దానికి రేవంత్ ఎలా స్పందిస్తాడు? లేదా పార్టీకి రాజీనామా చేసే విషయం చర్చిస్తారా? సమావేశం తర్వాత మరి కొంత మంది ఏపీ నేతల గుట్టు రట్టు చేస్తారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

టీడీపీ నేతలందరికీ ఇప్పుడు రేవంత్ కొరకరాని కొయ్యలా మారాడు. రేవంత్ ని పార్టీలోనే కొనసాగేలా మచ్చిక చేసుకుందామా అంటే.. టీఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి కుదరదు. అలా కాదని.. రేవంత్ ని వదిలించుకోవాలని ప్రయత్నించినా పార్టీకి నష్టమే.  మిగితా నేతల గుట్టు రట్టు చేసే విషయం పక్కనపెడితే.. ఇప్పటి వరకు స్వామి భక్తుడిలా ఉన్న రేవంత్.. టీడీపీకి బద్ధ శత్రువుగా మారే అవకాశం ఉంది. దీంతో.. టీడీపీ నేతలతోపాటు.. అధిష్టానం కూడా ఈ విషయంలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అసలే చంద్రబాబు కూడా సమయానికి అందుబాటులో లేరు. దీంతో నేతల్లో టెన్షన్ మరింత పెరిగిపోతోంది.