Asianet News TeluguAsianet News Telugu

కర్నూలు జిల్లాలో గుప్తనిధులు.. ఏం బయటపడ్డాయో తెలుసా?

  • కర్నూలు జిల్లాలో గుప్త నిధి తవ్వకాలు
  • ఆరు రోజులుగా కొనసాగుతున్న తవ్వకాలు
here officials started illegal Treasure hunt in Kurnool district

ఎక్కడైనా సరే గుప్తనిధులు ఉన్నాయి అని తెలియగానే.. ప్రజలు తండోపతండాలు వెళ్లి.. తవ్వకాలు మొదలుపెడతారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా జరగడం ఎక్కడైనా కామన్. కానీ కర్నూలు జిల్లాలో ఇందుకు విరుద్దంగా జరుగుతోంది. గుప్త నిధుల కోసం అధికారులు తవ్వకాలు జరుపుతుంటే.. గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ గుప్తనిధి తవ్వకాలు సంచలనం రేపుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లె గ్రామంలో ఉన్న కోట అంతర్బాగంలో ప్రాచీనమైన దేవాలయం ఉంది. పాడుబడిన ఈ కోటలో నిధులు నిక్షేపాలు ఉన్నాయన్న ప్రచారం కొన్నాళ్లుగా జోరుగా సాగుతోంది. దీంతో తవ్వకాలకు అంతులేకుండా పోతోంది. అధికారులే తవ్వకాలకు సిద్ధమవడమే కాదు రాత్రి పగలు తేడా లేకుండా కొనసాగిస్తుండటాన్ని చెన్నెంపల్లి గ్రామస్తులు వ్యతిరేకించారు. తవ్వకాలకు అనుమతి ఏదంటూ పత్రాలు చూపించాలంటూ అడ్డం తిరిగారు. దీంతో దిగివచ్చిన జిల్లా యంత్రాంగం గ్రామస్తులతో చర్చించి దొరికిన నిధుల నుంచి 20 శాతం గ్రామాభివృద్ధికి కేటాయిస్తామని హామినివ్వడంతో తవ్వకాలకు ఊరి ప్రజల అనుమతిచ్చారు.

మరోవైపేమో.. ఈ తవ్వకాలను ప్రతిపక్ష పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎవరి అనుమతితో తవ్వకాలు జరుపుతున్నారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించగా.. అధికారుల నుంచి సమాధానం రాకపోవడం గమనార్హం. దీంతో.. జిల్లా కలెక్టర్ కి అధికారులపై ఫిర్యాదు చేశారు. ఆరు రోజులుగా భారీ బందోబస్తు మధ్య పురాతన కోటలో జరుగుతున్న తవ్వకాలపై పురావస్తు శాఖకు గాని చరిత్రకారులకు గాని మైన్స్ అండ్ జియాలజీకి గాని ఎలాంటి సమాచారం లేదన్న మాట వాస్తవం. ఇదే విషయంపై కలెక్టర్‌ను వైసీపీ ఎమ్మెల్యేల బృందం గట్టిగా నిలదీయడంతో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం మరింత ముదిరింది. పెద్ద రాతి గుండు కింద సొరంగంలా కనిపిస్తున్న మార్గంలో తవ్వకాలు జరుపగా ఇవాళ పెద్ద పెద్ద ఎముకలు గారతో కూడిన ఇటుకలు బయటపడ్డాయి. దీంతో తవ్వకాలపై ఉత్కంఠ ఏర్పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios