వర్షం కారణంగా ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది. హెచ్‌బీ కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది.

హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తుతోంది. మంగళవారం రాత్రి మొదలైన వర్షం.. బుధవారం ఉదయం కూడా కురుస్తూనే ఉంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరింది. వర్షం కారణంగా ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది. దీంతో వాహనదారులు సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 ఎల్బీనగర్‌లో 5.4 సెంటీమీటర్లు, ఆస్మాన్‌గడ్‌లో 4.8 సెంటీమీటర్లు, నారాయణగూడలో 4.6 సెంటీమీటర్లు, నాంపల్లిలో 4.2 సెంటీమీటర్లు,ఆసిఫ్‌నగర్‌లో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్డీకపూల్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, రామంతాపూర్‌, శివంరోడ్‌, అంబర్‌పేట్‌, బేగంపేట,లింగంపల్లి, అమీర్ పేట, సోమాజీగూడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది.

కాప్రా, మల్లాపూర్‌, నాచారం, హెచ్‌బీ కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలుచోట్ల జీహెచ్‌ఎంసీ అధికారులు రోడ్లపై చేరిన వరద నీటిని తొలగిస్తున్నారు. సహాయ చర్యలను డీసీ పంకజ్‌ పర్యవేక్షిస్తున్నారు.