లండన్ వీధుల్లో ముంబయి స్ట్రీట్ ఫుడ్ పరిచయం చేసిన ముంబయి కుర్రాళ్లు వడాపావ్ తో కోట్లు గడిస్తున్న ఇద్దరు మిత్రుల కథ ఇది

తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉంటే ఎడారిలో అయినా రాజాలా బ్రతికేయవచ్చు అని చెబుతుంటారు పెద్దలు. ఇది అక్షరాల నిజమని నిరూపించాడు ముంబయి యువకుడు సుజయ్. ఇంతకీ అతను ఏమి చేసాడనే కదా మీ డౌట్. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

 ప్రస్తుత కాలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం మన దేశానికి చెందిన యువకులు విదేశాలకు వెళ్లడం తరచూ చూస్తూనే ఉంటాం. అక్కడ రెసిషన్ వచ్చి ఉద్యోగాలు ఊడిపోతే.. ఎలా వెళ్లారో.. అలానే తిరిగి భారత్ కి వచ్చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితే సుజయ్ కి ఎదురైంది. సుజయ్.. యూకేలో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ రెసిషన్ కారణంగా 2009లో ఉద్యోగం కోల్పోయాడు. కానీ తను మాత్రం అందరిలాగా వెనక్కి వచ్చేయలేదు. అలా అని మరో కంపెనీలో ఉద్యోగం కోసం కూడా ప్రయత్నించలేదు. తనంతట తాను ఓ వ్యాపారాన్ని ప్రారంభించి..దానిని కాలక్రమేనా సామ్రాజ్యంగా మలుచుకున్నాడు.

ముంబయిలో అత్యంత తక్కువ ధరకి లభించే స్ట్రీట్ ఫుడ్ ఏది అంటే.. అందరూ ముక్త కంఠంతో ‘ వడా పావ్’ అని చెబుతారు. ముంబయిలో ఎంతో ఫేమస్ అయిన ఈ ఆహారాన్ని లండన్ ప్రజలకు పరిచయం చేశాడు సుజయ్. తన చిన్ననాటి మిత్రుడు సుభోద్ జోషితో కలిసి ప్రారంభించిన ఈ వ్యాపారం ఇప్పుడు వారిని లాభాల బాట నడిపిస్తోంది.

2009లో ఉద్యోగం కోల్పోయిన తర్వాత సుజయ్.. తన చిన్ననాటి మిత్రుడు సుభోద్ ని కలిశాడు. గతంలో సుజయ్ కి ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో వారిద్దరికీ వడాపావ్ బిజినెస్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. దీంతో ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. చివరికీ ఓ ప్రాంతంలో పెట్టే అవకాశం దొరికింది. ఓ ఐస్ క్రీమ్ షాపు ఓనరు వారు బిజినెస్ పెట్టుకోవడానికి కొంత చోటు కల్పించాడు. అందుకు ఆయనకు వీరిద్దరూ రెంట్ కింద రూ.35వేలు చెల్లించాల్సి వచ్చింది. ఆ డబ్బులు చెల్లించడానికి వీరు చాలానే కష్టపడ్డారు.

ఎట్టకేలకు 2010వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన లండన్ లోని ఓ రద్దీ ప్రాంతంలో శ్రీ కృష్ణ వడాపావ్ పేరిట వెంచర్ ప్రారంభించారు. మొదట వడపావుని ఒక యూరోకి అమ్మారు. ఈ ఫుడ్ ని లండన్ ప్రజలకు అలవాటు చేసేందుకు ఉచితంగా కూడా అందజేశారు. చివరికీ అక్కడి ప్రజలు ఈ ముంబయి స్ట్రీట్ ఫుడ్ కి బాగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం వీరి వార్షిక ఆదాయం రూ.4కోట్ల పై చిలుకే. వడాపావుతో ప్రారంభించి.. ఇప్పుడు 160 రకాల ఇండియన్ ఫుడ్ వెరైటీలను అందిస్తున్నారు.