టీం ఇండియా పేసర్ మహ్మద్ షమీ గురించి ఆయన భార్య హనీస్ జహాన్.. రోజుకో విషయాన్ని బయటపెడుతున్నారు. తన భర్తకు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తనను హింసిస్తున్నాడంటూ మీడియా ముందుకు వచ్చిన హనీస్.. రోజుకో సంచలన విషయాన్ని తెలియజేస్తున్నారు. నిన్నటికి నిన్న గతంలో షమీ ఆత్మహత్యకు యత్నించాడన్న విషయాన్ని చెప్పగా.. తాజాగా.. మ్యాచ్ ఫిక్సింగ్ కి కూడా పాల్పడ్డాడని వివరించారు.

షమీ తననే కాదు.. దేశాన్ని కూడా మోసం చేశాడని ఆమె ఆరోపించారు. దుబాయ్‌లో అలీ సబా అనే పాకిస్థాన్‌ అమ్మాయి నుంచి షమీ డబ్బు తీసుకున్నాడుని.. అందుకు తన దగ్గర ఆధారాలున్నట్లు ఆమె చెప్పారు. ఇంగ్లండ్‌కు చెందిన మహ్మద్‌ భాయ్‌ సూచన మేరకు షమీ ఆ డబ్బులు తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగంగానే ఆ డబ్బు షమీ తీసుకున్నాడని.. ఒక వేళ ఇది నిజం కాకపోతే.. డబ్బులు ఎందుకు తీసుకున్నాడో చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

గతనెల దక్షిణాఫ్రికా పర్యటనలో  భాగంగా జట్టు సభ్యులంతా భారత్‌ వచ్చేయగా షమి దుబాయ్‌లో ఆగిన విషయాన్ని జహాన్‌ ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఆ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్‌ లో పాకిస్థాన్ మహిళను కలుసుకున్నాడుని, ఫిబ్రవరి 18న ఆమెతో కలిసి అతడు ఓ హోటల్‌లో చెక్‌ ఇన్‌ అయినట్లు తెలిపింది. వీటిపై తాను నిలదీస్తే ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు పాల్పడ్డాడని జహాన్‌ పేర్కొన్నారు.