వీళ్ల పెళ్లి కథతో.. సినిమా తీయచ్చు..!

Groom Takes Kochi Metro To His Wedding because of heavy traffic
Highlights

  • ఈ ఫోటోలో కనిపిస్తున్న జంట పెళ్లి లో ఇలాంటి ట్విస్టులే ఎదురయ్యాయి.

‘‘హీరో, హీరోయిన్ కి పెళ్లి.. పెళ్లి కూతురు మండపంలో కూర్చుంటుంది. పెళ్లి కొడుకు కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరతాడు. ఒకవైపు పెళ్లి ముహుర్తం దగ్గరపడుతుంటుంది. కానీ ఇంకా పెళ్లి కొడుకు మండపానికి చేరుకోడు. మండపానికి చేరుకునే క్రమంలో హీరోకి ఎన్ని అడ్డంకులో.. కానీ ఎట్టకేలకు హీరో.. మండపానికి చేరుకొని హీరోయిన్ మెడలో మూడుముళ్లు వేసేస్తాడు..’’ ఇలాంటి కథ చాలా సినిమాల్లో చూసేఉంటారు. కానీ నిజజీవితంలో చూశారా.. ఈ ఫోటోలో కనిపిస్తున్న జంట పెళ్లి లో ఇలాంటి ట్విస్టులే ఎదురయ్యాయి.

 

అసలు సంగతేంటంటే..  కేరళకు చెందిన రంజిత్ కుమార్, ధన్యలకు గత వారం క్రితం వివాహం జరిగింది. వివాహానికి ధన్య తన కుటుంబసభ్యులతో ముందుగానే మండపానికి చేరుకుంది. కానీ.. రంజిత్ ఉన్న ప్రాంతానికి మండపానికి 130కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో.. రాత్రికి పెళ్లి కాగా.. డిసెంబర్ 23వ తేదీ ఉదయం ఆరుగంటలకే కారులో బయలుదేరాడు. కొద్ది దూరం వచ్చారోలేదో.. వాళ్ల కారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. అక్కడే సమయం 11గంటలు దాటింది. ట్రాఫిక్ మాత్రం కదలడం లేదు. చేసేదేమీ లేక మెట్రోని ఆశ్రయించారు.  అక్కడికి వెళితే.. టికెట్ కౌంటర్ దగ్గరే పెద్ద క్యూ ఉంది. వెంటనే అక్కడున్న వాళ్లకి తన పరిస్థితిని వివరించి మెట్రో ట్రైన్ టికెట్ సంపాదించాడు.

 

మరోవైపేమో.. పెళ్లి ముహుర్తం దగ్గరపడుతోంది. ఇంకా పెళ్లి కొడుకు వాళ్లు రాలేదని వధువు తరపు వాళ్లు టెన్షన్ పడుతున్నారు. చివరికి ఎలానో అలా మెట్రో ట్రైన్ ఎక్కి రంజిత్ మండపానికి చేరుకున్నాడు. సరిగ్గా ముహుర్తం సమయం దగ్గరపడటంతో ధన్య మెడలో తాళికట్టేశాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు వీళ్ల పెళ్లి కథను కొచ్చి మెట్రో స్టేషన్ తమ ఫేస్ బుక్ లో పెట్టింది. నూతన దంపతులు తమ పెళ్లి జరిగిన తీరును వివరిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. మీరు ఓ సారి చూసేయండి.

loader