పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో అడుగుపెడుతున్న వధూవరులకు బంధువులు, స్నేహితులు బహుమతులు ఇవ్వడం సర్వసాధారణం. గిఫ్ట్ గా కొందరు డబ్బులు, బంగారం లేదా ఇంకేదైనా వస్తువులు ఇస్తూ ఉంటారు. అయితే.. ఓ నూతన జంటకి బాంబు బహుతిగా వచ్చింది. అది బాంబు అని తెలియక దానిని తెరచిన వరుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశా లోని బోలన్ గిరి ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఈ నెల 18వ తేదీన వివాహం జరిగింది. ఈ నెల 21న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విందుకు వచ్చిన ఓ వ్యక్తి.. ఆ నూతన జంటకు బహుమతిగా బాంబు ఇచ్చాడు. అయితే దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత విప్పితే పేలిపోయింది. ఈ ప్రమాదంలో నూతన వధూవరులతో పాటు వరుడి నానమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వరుడు, నానమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వధువు చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.