ట్రక్కుకు  జిపిఎస్ అమర్చారని తెలియక ఈజీగా పోలీసులకు దొరికిన దొంగపోలీసులు

పోలీసు వేషం వేసుకుంటే పోలీసయిపోరని ఈ చిన్న న్యూస్ కథ నీతి, అంతే.

అనగనగా ముగ్గురు దొంగలు. పోలీసు వేషం వేసుకుని దేశం మీద బడ్డారు. వేషం వేసుకున్నాం కాబట్టి, పోలీసుల్లా కనబడుతున్నాం, ఇంకేం పర్వాలేదు, అనుకున్నారు. కాని పోలీసు బుర్ర మిస్సయిందన్న విషయం వారికి తట్ట లేదు.

మొన్న బుధవారం నాడు వీళ్లొక టాంకర్ ని కర్నాటక హసన్ పట్టణ పొలిమేరల్లో అటకాయించారు.

సాయంత్రం 6 గంటలకు టవున్లోని హెచ్‌పీసీఎల్‌ బంకునుంచి 20వేల లీటర్ల డీజిల్‌ నింపుకుని క్లీనర్‌తో పాటు డ్రైవర్‌ మణి ఈ టాంకర్ ను బెంగళూరు తీసుకెళ్తున్నాడు. టౌన్‌ దాటాడో లేదో మన ‘పోలీసులు’ ట్యాంకర్‌ను ఆపి తామూ అటు వైపే వెళ్తున్నామంటూ ఎక్కారు.

ట్యాంకర్‌ హసన్‌ దాటి ఘాట్‌ ప్రాంతానికి చేరుకోగానే లారీ ఆపమని చెప్పి డ్రైవర్, క్లీనర్‌పై దాడి చేసి తాళ్లతో కట్టివేసి, ట్యాంకర్‌ క్యాబిన్‌లోనే సీట్ల కిందకి తోసేశారు. టాంకర్ ను ఎటో హైజాక్ చేసుకు పోయారు.

ట్యాంకర్ కు జిపిఎస్ ఉన్న విషయం దొంగ పోలీసులు గుర్తించ లేకపోయారు.

ట్యాంకర్ మాయమయిన విషయం కంపెనీకి తెలిసిపోయింది. టాంకర్ ఆచూకి లేకపోవడంతో ఇందులో ఏదో మోసం జరిగిందని వారు జిపిఎస్ సిస్టమ్ ద్వారా ట్యాంకర్ ఎక్కుడందో వెదికారు.

 అది కర్నూల్ జిల్లా వెల్దుర్తి పట్టణ సమీపంలోని రామళ్లకోట రోడ్డు మీద ఉన్న ఒక పెట్రోల్‌ బంక్‌ సమీపంలోకనిపించింది.

జిపిఎస్ ద్వారా తాము తెలుసుకున్న సమాచారాన్ని అయిల్ కంపెనీ వారు వెంటనే కర్నూలు జిల్లా పోలీసుకు చేరవేశారు. రంగంలోకి దిగిన ఎస్‌ఐ టీం రామళ్లకోట ప్రాంతంలో ఆ ఏరియా మొత్తం గాలించి రాత్రి 11 గంటల ప్రాంతంలో వెల్దుర్తి సమీపంలో ఒక ఇటుకల బట్టీ పక్కన ముళ్ల పొదల మధ్య ట్యాంకర్‌ను గుర్తించారు.

 ఒరిజినల్ పోలీసులు ట్యాంకర్ ను సమీపిస్తుండగా, ముగ్గురు నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు తప్పించుకున్నారు. ట్యాంకర్‌ క్యాబిన్‌లో సీట్ల కింద కట్టేసిన డ్రైవర్‌ మణి, క్లీనర్‌ను బయటకు తీశారు. రెండు రోజులుగా తిండి, నీళ్లు లేక అపస్మారక స్థితిలో ఉండడం చూసి వారికి వైద్యం చేశారు. పట్టుబడిన వ్యక్తి పేరు అభిషేక్‌. తామంతా బెంగళూరు వాసులుమని చెప్పినట్లు ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ తెలిపారు.