గాంధీ జయంతి రోజున స్వచ్ఛభారత్ కార్యక్రమాలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ టాయ్ లెట్’ సినిమా ప్రదర్శన
దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గాంధీ జయంతి రోజున ఓ సినిమాని ప్రదర్శించనున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ‘ టాయ్ లెట్- ఏక్ ప్రేమ్ కథా’ సినిమా.. ఇటీవల విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని అన్ని ఆస్పత్రుల్లో ప్రదర్శించనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ప్రధాని నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ‘ స్వచ్ఛ భారత్’. ఈ అక్టోబర్ 2వ తేదీకి ఈ కార్యక్రమం చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో.. దేశంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవగాహన కల్పించాలనుకుంటున్నారు. టాయ్ లెట్ ని వినియోగించకపోవడం వల్ల కలిగే జబ్బులు తదితర విషయాలను తెలియజేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ టాయ్ లెట్’ చిత్రాన్ని దేశంలోని అన్ని ఆస్పత్రుల్లోని రోగులకు చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే.. సినిమాని కచ్చితంగా ప్రదర్శించాలనే నియమేమీ లేదని.. వీలుని బట్టి ప్రదర్శించమని ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రులకు తెలిపారు.
బహిరంగ మల మూత్ర విసర్జన వల్ల కలిగే అనర్థాలను, టాయ్ లెట్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ తీసిన సినిమా ‘ టాయ్ లెట్’. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. అందుకే ఈ సినిమాని ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
