బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు బుధవారం సాయంత్రం రాజభవన్ కు చేరుకున్నారు. బస్సుల్లో వారు అక్కడికి చేరుకున్నారు. అయితే, ఎమ్మెల్యేల పరేడ్ ను గవర్నర్ వాజుభాయ్ వాలా అనుతించలేదు.

కాంగ్రెసు నుంచి పది మంది, జెడిఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను గవర్నర్ అనుతించారు. దీంతో మిగతా ఎమ్మెల్యేలంతా బయటే ఉండిపోయారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన సంఖ్యాబలం తమకు ఉందని కుమార స్వామి అన్నారు. అదే విషయం గవర్నర్ కు చెప్పినట్లు తెలిపారు. 

అవసమైన డాక్యుమెంట్లను తాము గవర్నర్ కు సమర్పించినట్లు ఆయన తెలిపారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జెడిఎస్ నాయకులు అంటున్నారు. గోవా విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తమకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.

కొందరు శాసనసభ్యులు అందుబాటులో లేరని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెసు, జెడిఎస్ నేతలు ఎమ్మెల్యేల పరేడ్ చేయించాలని నిర్ణయించారు. అయితే, వారికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. ఈ స్థితిలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.

యడ్యూరప్ప కూడా బుధవారం సాయంత్రం గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.