బంగారం దిగుమతులపై ఆంక్షలు..

Government Restricts Gold Silver Import From South Korea
Highlights

  • బంగారాన్ని వినియోగించే దేశాలలో చైనా తరువాతి స్థానం భారత్ దే
  • దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి

బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇటీవల కాలంలో దక్షిణ కొరియా నుంచి భారత్ కు బంగారం, వెండి దిగుమతులు అమాంతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వీటిని  అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇకపై వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి అయ్యేలా వాటిని పరిమిత జాబితాలో చేర్చాలని నిర్ణయించింది.

 

ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో చైనా తరువాతి స్థానం భారత్ దే. దీంతో దిగుమతులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇటీవల ప్రభుత్వం జీఎస్టీ ని అమలు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌, దక్షిణకొరియాకు మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉండటం వల్ల దిగుమతైన బంగారంపై ప్రాథమిక కస్టమ్‌ సుంకం విధించడానికి వీల్లేదు. ప్రస్తుతం సమీకృత జీఎస్టీ కింద బంగారంపై 3 శాతం పన్ను మాత్రమే పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు దక్షిణ కొరియా నుంచి బంగారం దిగుమతులు అధికం చేశారు.

 

గత నెల జులై నుంచి ఆగస్టు 21 వరకు మన దేశంలో ఒక బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువైన బంగారం దిగుమతవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నాణేలు, అభరణాలతో సహా అన్ని రకాల బంగారు, వెండి వస్తువులపై ఈ పరిమితి వర్తిస్తుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యాపారులు స్వాగతించారు. ఈ విషయంపై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ఈ నిర్ణయం దక్షిణ కొరియాతో ఉన్న సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపబోదు. పైగా ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఇరు దేశాల మధ్య ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కూడా ఎలాంటి విఘాతం కలగదు’ అని అన్నారు.

loader