జనవరి 7వ తేదీ నుంచి మొబైల్ ఫోన్లన్నీ పనిచేయవా? మీ ఫోన్ కి ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ పనిచేయవా..? ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. 2018 వ సంవత్సరం జనవరి 7వ  తేదీ నుంచి మీ మొబైల్ ఫోన్ పనిచేయదు అంటూ.. కొందరకి మెసేజ్ లు వస్తున్నాయి. అవి నిజమా కాదా.. అనే సందిగ్ధంలో పడ్డారు యూజర్లు.  అంతేకాదు.. వెంటనే మీ టెలికాం ఆపరేటర్ ని మార్చుకోవాలని లేకపోతే.. మీ ఫోన్లు పనిచేయవంటూ మెసేజ్ లు వస్తున్నాయి. అన్ని టెలికాం సంస్థలకు చెందిన యూజర్లకూ ఈ మెసేజ్ లు రావడం గమనార్హం. దీంతో వెంటనే కస్టమర్లు ట్విట్టర్ వేదికగా.. తమ టెలికాం కంపెనీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ మెసేజ్‌లను టెలికాం కంపెనీలు పంపడం లేదట. యూజర్ల  ఫిర్యాదులపై స్పందించిన జియో, వొడాఫోన్‌, ఐడియా కంపెనీలు, అది తప్పుడు మెసేజ్‌లను అని, యూజర్లు ఆ మెసేజ్‌ను పట్టించుకోవద్దంటూ క్లారిటీ ఇచ్చాయి. వాటిని తాము పంపడం లేదని కూడా పేర్కొన్నాయి. ఎయిర్‌టెల్‌ ప్రతినిధి ఆ మెసేజ్‌ను ఓ  స్పామ్‌గా ధృవీకరించారు. టాటా డొకోమో, బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్లకు కూడా ఈ మెసేజ్‌లు వస్తున్నట్టు తెలిసింది. ఆశ్చర్యకరంగా యూపీసీ (యూనిక్ పోర్టింగ్ కోడ్) ను జనరేట్‌ చేసి నెంబర్‌ను వేరే నెట్‌వర్క్‌ కు పోర్టు పెట్టుకోవాలంటూ యూజర్లను ఆదేశిస్తున్నాయి. అయితే ఏ  ఆపరేటర్‌కు పోర్టు పెట్టుకోవాలో చెప్పడం లేదు.