భవిష్యత్తులో ఎవరు బంగారం కొనుగోలు చేయాలన్నా ఖచ్చితంగా ప్యాన్ నెంబర్ తో పాటు చెక్ లేదా కార్డు పేమెంట్ ద్వరానే కొనుగోలు చేయాలనే నిబంధన కూడా రానున్నట్లు తెలిసింది.

నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడి దృష్టంతా బంగారం మీద పడినట్లుంది. అసలే, భారతీయులకు బంగారమంటే భలే మోజు. అందుకనే ఏమాత్రం అవకాశం ఉన్నా భారతీయలు ముఖ్యంగా మహిళలు బంగారం కొనటాన్ని బాగా ఇష్టపడతారు. అంతే కాకుండా అవసరం వచ్చినపుడు అదే బంగారాన్ని కుదవ పెట్టటమో లేక అమ్మేయటమో చేసి తమ అవసరాలను తీర్చుకుంటారు. అందుకే భారతీయులకు, బంగారానికి అంతటి అవినవభావ సంబంధముంది.

అటువంటిది భారతీయులు దాచుకున్న బంగారం నిల్వలపై ప్రధాని దృష్టి పడినట్లు ప్రచారమవుతోంది. ఆభరణాల రూపంలో ఉన్న బంగారాన్ని, ఇతర రూపాల్లోని మొత్తం బంగారాన్ని వెలికితీసి లెక్కలు తేల్చాల్సిందేనని మోడి గట్టిగా అనుకుంటున్నట్లు సమాచారం. ఎవరెవరి దగ్గర ఎంతెంత బంగారముంది, వాటిని ఎప్పుడెప్పుడు కొనుగోలు చేసారు అన్న లెక్కలు తీయాలని అనుకుంటున్నారు. దాంతో సర్వత్రా ఆందోళన మొదలైంది.

ఎందుకంటే, నోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే నల్లధన కుబేరుల్లో పలువురు తమ వద్దనున్న మొత్తం డబ్బును బంగారం రూపంలోకి మార్పిడి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ విధితమే. దానికి తోడు తమ వద్ద ఉన్న డబ్బుతో కొనుగోలు చేసే బంగారానికి చాలా మంది బిల్లులను పెద్దగా దాచుకోరు కూడా. అటువంటి వారి భరతం పట్టే ఉద్దేశ్యంతోనే బంగారం నిల్వల లెక్కలను వెలికి తీయాల్సిందేనని మోడి గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశం మొత్తం మీద సుమారు 40 వేల టన్నుల బంగారం ఉంది. ఇదంతా ఆభరణాలు, బార్లు, బిస్కెట్లు, పెట్టుబడుల రూపంలో ఉంది. మొత్తం బంగారంలో సుమారు 10 వేల టన్నుల బంగారం బ్యాంకు లాకర్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, 23 వేల టన్నల బంగారం ఆభరణాలు ఇళ్ళల్లోనూ, కుదవ వ్యాపారస్తుల వద్ద, ఆభరణాలవ్యాపారస్తుల వద్ద ఉన్నట్లు సమాచారం. ఇక, దేవాలయాల్లో 4 వేల టన్నులున్న తెలుస్తోంది.

మన దేశంలోకి వస్తున్న మొత్తం బంగారంలో అక్రమ మార్గాల్లో వస్తున్న బంగారం కనీసం 25 శాతం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి అక్రమ మార్గాల్లో వస్తున్న బంగారాన్ని అరికట్టాలంటే ప్రతీ కొనుగోలుకూ లెక్క ఉండాల్సిందేనని మోడి భావిస్తున్నారు. దాంతో బంగారం కొనుగోలుకు ఇప్పటికన్నా మరింత కట్టుదిట్టం చేసేందుకు మార్గాలు చూస్తున్నారు.

అందులో భాగంగానే భవిష్యత్తులో ఎవరు బంగారం కొనుగోలు చేయాలన్నా ఖచ్చితంగా ప్యాన్ నెంబర్ తో పాటు చెక్ లేదా కార్డు పేమెంట్ ద్వరానే కొనుగోలు చేయాలనే నిబంధన కూడా రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే జనాల వద్ద ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాల్సిందేనని కూడా కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ చెప్పలేకపోతే దానిని అక్రమమార్గాల్లో కొనుగోలు చేసినట్లు భావిస్తారా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు.