Asianet News TeluguAsianet News Telugu

ఖిలా చుట్టూ వెయ్యి మంది పోలీసులు..!

  • ఈ ఏడాది కూడా గోల్కొండ ఖిలా.. ఆ వేడుకలకు ముస్తాబౌతోంది
  • ఖిలా చుట్టూ అధికారులు పహారా ఏర్పాటు చేశారు.
Golconda Fort All Set For Independence Day Celebrations

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తయ్యింది. నూతన రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి.. పంద్రాగస్టు వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్.. గోల్కోండ కోటలోనే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా గోల్కొండ ఖిలా.. ఆ వేడుకలకు ముస్తాబౌతోంది. ఇందులో భాగంగానే.. ఖిలా చుట్టూ అధికారులు పహారా ఏర్పాటు చేశారు.

ఉగ్రముప్పున్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ ఉందంటూ కేంద్ర నిఘావర్గాలు  ఇటీవల హెచ్చరికలు జారీ చేశాయి.  ఈ నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు కేంద్ర నిఘావిభాగం అధికారులతో చర్చించారు. వారం ముందునుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుని కీలక అంశాలను ఇప్పటి నుంచే అమలు చేస్తున్నారు. ప్రత్యేక బీట్‌ వ్యవస్థను వారంపాటు కొనసాగించనున్నారు. వెస్ట్ జోన్  డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కోటచుట్టూ వెయ్యిమంది పోలీసులను, పరిసర ప్రాంతాల్లో మరో వెయ్యి మంది పోలీసులను మూడంచెలుగా ఏర్పాటు చేశారు. మెహిదీపట్నం నుంచి గోల్కొండ కోట వరకు, గచ్చిబౌలినుంచి షేక్‌పేట మీదుగా గోల్కొండ కోటకు దారితీసే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.

 పంద్రాగస్టు వేడుకలే లక్ష్యంగా.. దేశంలో బీభత్సం సృష్టించేందుకు ఉగ్రవాదులు కాచుకొని ఉన్నారు. జమ్మూకాశ్మీర్ సహా ముంబయి, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధంగా  ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో ఎలాంటి అపశ్రుతి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రధానంగా లంగర్‌హౌస్‌ నుంచి గోల్కొండ కోటకు వెళ్లేమార్గం, టోలీచౌకీ నుంచి గోల్కొండకు వెళ్లే నాలుగు మార్గాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. పదుల సంఖ్యలో సీసీకెమెరాలను కూడా కోట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios