పానాజీ: ఓ మహిళ తన భర్తను గొంతు నులిమి చంపేసింది. శవాన్ని ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పారేసింది. ఈ కేసులో పోలీసులు మహిళతో పాటు నలుగురిని గోవా పోలీసులు అరెస్టు చేశారు. 

క్యాజువల్ లేబర్ గా పనిచేస్తున్న తన భర్త బసువరాజ్ బస్సు (38)ను కల్పన బస్సు నెల రోజుల క్రితం చంపేసింది. శవాన్ని మూడు ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పారేసింది. మిత్రులు శవాన్ని ముక్కలుగా నరికి పారేసేందుకు సహకరించారు. 

నిందితుల్లో ఒకతని భార్య తన భర్త ప్రవర్తన పట్ల అనుమానం వచచి వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. 

దాంతో పోలీసులు మృతుడి భార్యను, సురేష్ కుమార్, అబ్దుల్ కరీం షేక్, పంకజ్ పవార్ అనే ముగ్గురు వ్యక్తులను మంగళవారం అరెస్టు చేసారు. వారంతా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 

నిందితురాలైన మహిళ తన భర్తతో కలిసి దక్షిణ గోవా జిల్లాలోని చర్చోరేమ్ గ్రామంలో నివసిస్తోంది. వారికి ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు. రాత్రి గొడవ జరిగిందని, ఆ సమయంలో తాను తన భర్త గొంతు నులిమి చంపేశానని నిందితురాలు పోలీసులకు చెప్పింది. 

నేరం కచ్చితంగా ఎప్పుడు జరిగిందనేది ఆమె చెప్పలేదు. చంపిన తర్వాత విషయాన్ని భర్త మిత్రులకు చెప్పింది. ఆ ముగ్గురు శవాన్ని తరలించడానికి సహకరించారు. నలుగురు కూడా శవాన్ని మూడు ముక్కలు చేసి గన్నీ బ్యాగుల్లో పెట్టి కారులో తీసుకని వెళ్లి గోవా - కర్ణాటక సరిహద్దులోని అటవీ ప్రాంతంలో పారేశారు. 

నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతానికి వెళ్లి మృతుడి శరీర భాగాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.