పారిశుధ్య పనులనను ఐటీతో ముడివేసింది. జీహెచ్ ఎంసీ పరిధిలోని 150 వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చారు
స్వచ్ఛభారత్ లో భాగంగా ఇటీవల కాలంలో భాగ్యనగరంలో పారిశుధ్య పనులు బాగానే జరుగుతున్నాయి. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. ఆ వీధుల్లో కి అడుగు పెడితే చాలు..కంపు బరించలేకపోతాం. ఇక ఆ ప్రాంతంలోనే ఉన్నవారి సంగతి అయితే.. చెప్పనక్కర్లేదు. మనం ఇంట్లో ఏ రోజుకి ఆ రోజు చెత్తను చెత్త తీసుకువెళ్లే వ్యక్తికి ఇస్తునే ఉన్నాం.. శుభ్రంగానే ఉంచుతున్నాం అని మీరనుకోవచ్చు. చెత్త తీసుకువెళ్లిన వ్యక్తి ఆ చెత్తను ఎక్కడ పడేస్తున్నాడు.. అక్కడి నుంచి చెత్తను మళ్లీ ఎక్కడికి తరలిస్తున్నారు. లాంటి విషయాలు మనకు తెలీదు. అధికారులు కూడా ప్రతి ఏరియాకు తిరిగి ఎక్కడ చెత్త ఉందో కనుక్కోలేరు కదా.. అందుకే ఓ కొత్త(చెత్త) టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దీని సహాయంతో చెత్త ఎక్కడుంది? చెత్త కుండీ శుభ్రం చేశారా లేదా అనే విషయాలు తెలుస్తాయి. వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ సమాచార సాంకేతికతను ఉపయోగించి పౌర సేవల్ని మెరుగుపరచడంలో మరో అడుగు ముందుకేసింది. పారిశుధ్య పనులనను ఐటీతో ముడివేసింది. దీనిలో భాగంగా జీహెచ్ ఎంసీ పరిధిలోని 150 వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చారు. దీని ద్వారా సంబంధిత ప్రాంతంలో రోజుకు ఎంతమేర వ్యర్థాలు ఉత్పత్తికి అవుతున్నాయి.. వాటిని సిబ్బంది ఎన్ని సార్లు తొలగిస్తున్నారు, తరలించే వాహనాలు ఎన్ని డబ్బాలను తీసుకువెళ్తాయనే ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. తద్వారా సిబ్బంది పనితీరు విశ్లేషణ, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం సాధ్యమౌతుందని అధికారులు భావిస్తున్నారు.
చెత్త కుండీలను జీహెచ్‌ఎంసీ ఆర్‌ఎఫ్‌ఐడీతో ట్యాగ్ చేసింది. వీటిలోని చెత్తను రెఫ్యూజీ కాంపక్టర్ వాహనాలు శుభ్రం చేయాలి. డబ్బాల్లోని చెత్తను శుభ్రం చేయగానే వాటిపై ఉన్న ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్ ద్వారా సమాచారం తరలింపు వాహనానికి చేరుతుంది. రోజులో ఎన్ని సార్లు, ఏయే ప్రాంతాల్లో చెత్త డబ్బాలను శుభ్రం చేశారనే సమాచారం సంబంధిత ఆరోగ్య అధికారి, సహాయక ఇంజినీర్లకు చేరుతుంటుంది. దీని వల్ల కుండీలను రోజుల తరబడి అలాగే ఉంచడం ఇకపై కుదరదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
