పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని వట్లూరు చెరువులో పడి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అయితే ప్రస్తుతానికి ఒక్క శవం మాత్రం చెరువులో లభ్యమయ్యింది. 

వివరాల్లోకి వెళితే  పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు లోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో విజయ్ శంకర్, హరి క్రిష్ణ రాజు, పరశురాం, కోట సాయి లు బిటెక్ 3 వ సంవత్సరం చదువుతున్నారు. అయితే వీరంతా కలిసి ఇవాళ కాలేజీ సమీపంలో జామ తోటలోకి సరదాగా వెళ్లారు. అయితే అక్కడి నుండి తిరిగి వస్తుండగా వీరు ప్రమాద వశాత్తు చెరువులో పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

అయితే చెరువులో మాత్రం ఒక్కటే మృతదేహం దొరకడం, గట్టున మాత్రం నలుగురికి సంబంధించిన ఐడీ కార్డులు, బ్యాగులు లభించడం  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెరువులో పడి మృతి చెందింది ఒకరా లేక నలుగురా అనేది సందిగ్ధంగా మారింది.  అయితే గుర్తింపు కార్డులు ఆధారంగా నలుగురూ మృతి చెంది వుంటారన్న అనుమానంతో చెరువులో పోలీసులు ఇంకా గాలింపు చేపట్టారు.  

ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.