టీడీపీకి అదే గతి పడుతుందా?

టీడీపీకి అదే గతి పడుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన భూసేకరణ- రైతులు, రైతు కూలీల హక్కుల పరిరక్షణ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో రైతుల బతుకులను నాశనం చేసిన చక్రవర్తులు, పాలెగాళ్లు, భూస్వామ్యులు మట్టికొట్టుకుపోయారని గుర్తు చేశారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని హెచ్చరించారు.

రైతులను బెదిరించి భూములను లాక్కుంటుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్య పాలన ఉందా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన చూస్తుంటే మనం రాచరికంలో ఉన్నామేమో అనే అనుమానం కలుగుతోందన్నారు.  టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాజ్యాంగం రైతులకు కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ధ్వజమెత్తారు.  అందరికీ అన్నం పెట్టే రైతులకే రక్షణ లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఏడాదికి మూడు పంటలు పండే ప్రాంతంలో రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

భూసేకరణ చట్టానికి సవరణ చేయాలన్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించవన్నారు. చట్టాన్ని మార్చే అధికారం ఏపీ శాసనసభకు లేదన్నారు. రైతులు, రైతు కూలీలు ధైర్యంగా న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మూడు పంటలు పండే భూములపై తప్పుడు నివేదికలను ఇచ్చిన ప్రభుత్వంపై న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటాయన్నారు. నివేదిక ఇచ్చిన అధికారులకూ శిక్ష తప్పదని జస్టిస్ గోపాలగౌడ హెచ్చరించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos