సెల్ఫ్ డ్రైవింగ్ సూట్ కేసులు అడుగుపెట్టాయి

‘ సెల్ఫ్ డ్రైవింగ్’ కార్ల గురించి వినే ఉంటారు. డ్రైవర్ అవసరం లేకుండా వాటంతట అవే కార్లు రోడ్లపై తిరుగుతాయి. ఈ రకం కార్లు మన దేశంలో ఇంకా అడుగుపెట్టలేదు. కానీ.. అంతలోనే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ సూట్ కేసులు అడుగుపెట్టాయి. లాస్ వేగాస్ లో సీఈఎస్-2018( కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ సూట్ కేస్ ని ప్రదర్శించారు.

ఇంతకీ ఈ సూట్ కేస్ ప్రత్యేకత ఏంటో తెలుసా..? దానిని మనం మోయాల్సిన అవసరం లేదు. మన ముందు వెళ్తుంటే.. అది మన వెనకాల దానంతట అదే ఫాలో అవుతుంది. ఎప్పుడూ ట్రావెలింగ్ చేసేవారు లగేజ్ సమస్యను తప్పించుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కాలిఫోర్నియాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ రోబోట్ సూట్ కేస్ ని తయారు చేసింది. ఈ సూట్ కేస్ స్మార్ట్ ఫోన్ యాప్ తో పనిచేస్తుంది. అంతేకాదు గంటకు 11కిలో మీటర్ల వేగంతో ఇది నడుస్తుంది. దీని ధర 1100 అమెరికన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.70వేల పై మాటే. వచ్చే నెల ఫిబ్రవరిలో ఈ సూట్ కేసు ని అమెరికా మార్కెట్ లో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత యూరప్, జపాన్ దేశాల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ సూట్ కేస్ ని దొంగతనం చేయడం కూడా సులవేమి కాదు. స్మార్ట్ ఫోన్ యాప్ సహాయంతో దానిని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.