పిల్లలకు డబ్బు పాఠాలు నేర్పే ముందు.. వారు అడిగిన వెంటనే ఏదైనా కొనిచ్చే అలవాటును మానుకోవాలి అంటారు ఆర్థిక నిపుణులు. కనీసం ఒక రోజైనా వాయిదా వేయడం.. ఆ తర్వాత అది ఎందుకు, ఎంత మేరకు అవసరమో వారికే ఆలోచించుకునే సమయం ఇవ్వాలి. ఇది ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ వారికి ఆర్థిక క్రమశిక్షణ పెంచడంలో సాయం చేస్తుంది.
‘‘ ధనమేరా అన్నిటికీ మూలం.. ఆ ధనము విలువ తెలుసుకునుట మానవ ధర్మం’’ అన్నాడో సినీ కవి. నిజమే.. ప్రస్తుత కాలంలో మనిషిని నడిపించేది డబ్బే. ఏ పని జరగాలన్నా డబ్బు కావాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఆ డబ్బు విలువ తెలుసుకోవడం చాలా అవసరం. ప్రతి ఇంట్లో.. ఆర్థిక ప్రణాళికలు పెద్దవాళ్లే చూస్తారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారికి ఈ విషయాలు ఏవీ తెలియకుండా జాగ్రత్త పడతారు కొంతమంది తల్లిదండ్రులు. కానీ అది తప్పు. అలా చేయకూడదు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే వారికి ఆర్థిక పాఠాలు నేర్పాలి. లేకపోతే.. వారు పెద్దయ్యాక.. సరైన ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోలేక పోవచ్చు. కాబట్టి.. సేవింగ్స్ ఎలా చేయాలి? ఖర్చుల గురించి వారికి ముందునుంచే తెలియజేయడం అవసరం.
పిల్లలకు డబ్బు పాఠాలు నేర్పే ముందు.. వారు అడిగిన వెంటనే ఏదైనా కొనిచ్చే అలవాటును మానుకోవాలి అంటారు ఆర్థిక నిపుణులు. ఏ వయసులో ఉన్న పిల్లలకైనా ఇది వర్తిస్తుంది. కనీసం ఒక రోజైనా వాయిదా వేయడం.. ఆ తర్వాత అది ఎందుకు, ఎంత మేరకు అవసరమో వారికే ఆలోచించుకునే సమయం ఇవ్వాలి. ఇది ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ వారికి ఆర్థిక క్రమశిక్షణ పెంచడంలో సాయం చేస్తుంది. చిన్న వయసు నుంచే ఖర్చును వాయిదా వేయడం అనే అలవాటు వారి సొంతమౌతుంది.
పొదుపు..
ఆర్థిక పాఠాలు చెప్పడం మొదలు పెట్టగానే.. డబ్బు విలువ గురించి చెప్పకకూడదు. అది వారికి అంత ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు. కాబట్టి ముందుగా పొదుపు గురించి చెప్పడం మొదలు పెట్టాలి. వారికి ఈ విషయాలు తెలియజేసేటప్పుడు ఓపికగా వ్యవహరించాలి. మీ పిల్లల కోసం కిడ్డీ బ్యాంకులు ఏర్పాటు చేయించండి. ఏదైనా బొమ్మ కొనాలని అడిగినప్పుడు.. ఆ కిడ్డీ బ్యాకుంలో మని దాచుకొని.. ఆ తర్వాత కొనుక్కోమని చెప్పాలి . అలా ఏర్పాటు చేసిన కిడ్డీ బ్యాంకుల్లో వాళ్లు మనీ దాచి పెడుతున్నారో లేదో కూడా పరిశీలించాలి. ఈ విధంగా వారిలో పొదుపు లక్షణాన్ని పెంపొందించవచ్చు.
అవసరం,లగ్జరీ...
పిల్లలు వారికి ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే అడిగేస్తుంటారు. వాళ్లు అలా అడగగానే వెంటనే కొనివ్వకూడదు. అలా అని అసలు కొనివ్వమని కూడా చెప్పకూడదు. వారికి రోజుకి కొంత మనీ ఇచ్చి.. ఆ డబ్బుని కొన్ని రోజుల పాటు, వారాల పాటు దాచిపెట్టమని చెప్పండి. ఆలా కొన్ని రోజుల పాటు దాచిపెడితే.. ఆ మొత్తంతో.. వారికి ఇష్టమైన స్టోరీ బుక్స్, ప్లే స్టేషన్ లాంటివి కొనుక్కోవచ్చని వారికి చెప్పాలి. దీని వల్ల వారికి నెసిసిటీ గురించి అర్థమౌతుంది.
బడ్జెట్..
ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో నెలకు సరిపడా బడ్జెట్ వేసుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఇదే అలవాటు పిల్లలకు చిన్న వయసు నుంచే నేర్పించాలి. మే 1 నుంచి మే 31 వరకూ మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి గురించీ మీ పిల్లలకు చెప్పి ఖర్చు చేయండి. ప్రతి రూపాయినీ వారితో లెక్క రాయించండి. వచ్చిన మొత్తం ఎంత? ఖర్చవుతున్నది ఎంత? తెలిస్తే మీ దుబారా ఖర్చులకూ పిల్లలు కళ్లెం వేయగలరు. అదేవిధంగా వాళ్ల ఖర్చులకు కూడా ప్రత్యేకంగా బడ్జెట్ రాయమని చెప్పండి. దాని వల్ల వారు చేస్తున్న ఖర్చుల గురించి తెలుసుకోగలగుతారు. అంతేకాకుండా దీని వల్ల వాళ్ల చదువుకి కూడా ఉపయోగం ఉంటుంది. ప్రస్తుతం 3, 4 తరగతుల పిల్లలకు కూడా డబ్బు గురించి లెక్కలు ఉంటున్నాయి. మీరు ఇంట్లో నేర్పించే వాటి వలన పిల్లలు డబ్బు లెక్కలు చేయడంలో నేర్పరులౌతారు.
డబ్బు సులభంగా రాదు..
డబ్బు గురించిన సంగతులు పిల్లలకు సులభంగా అర్థం అయ్యేలా చెప్పొచ్చు. దీనికోసం సాంకేతిక సాయం తీసుకోండి. డబ్బును ఎలా ముద్రిస్తారు.. ఎక్కడ ముద్రిస్తారు అనే విషయాలు ఇంటర్నెట్‌లో దొరుకుతాయి. ఇక మీ ఇంటికి డబ్బు ఎలా వస్తుందో.. మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేసి డబ్బు ఎలా ఆర్జిస్తున్నారో తెలియజేయాలి. పిల్లల ముందు కార్డులు తీసి ఇవ్వడం ద్వారా వారికి కార్డుల్లో డబ్బు ఉంటుందనే భావన బలపడుతుంది. కానీ, దానిలోకి డబ్బు రావాలంటే ఏం చేయాలో వారికి తెలియజేయాలి. కేవలం బ్యాంకుకు వెళ్తే డబ్బు ఇవ్వరనీ, అందుకు ఉద్యోగం, వ్యాపారం చేయాల్సి ఉంటుందని తెలియజేయాలి. మీరు పిల్లలకు చిన్న చిన్న పనులు చెప్పి, వారు చేసినప్పుడు డబ్బు ఇస్తామని చెప్పండి. దాన్ని దాచుకోవాలనీ, ఖర్చులకు వాడుకోవాలనీ సూచించాలి. ఇక్కడ జాగ్రత్త పడాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బు ఇవ్వడం అనేది అలవాటయ్యి.. డబ్బు ఇస్తేనే పనిచేస్తాననే మాట రాకూడదు. ఇది కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఇచ్చిన డబ్బులో నుంచి ఎంత దాచుకున్నారో అప్పుడప్పుడూ చూస్తామని చెప్పండి. వారికి ఏదైనా ప్రోత్సాహకరమైన బహుమతి ఇవ్వండి.
ఇలా చేయడం వల్ల.. పిల్లలో ఆర్థిక ప్రణాళికకు చిన్న వయసులోనే పునాది వేసినవారౌతారు. అది వారికి భవిష్యత్తులో చక్కగా ఉపయోగపడుతుంది.
అధిల్ శెట్టి, బ్యాంకు బజార్.కామ్ సీఈవో
