పీవీ ఆర్థిక సంస్కరణలే నేటి డిజిటల్ ఇండియాకు నాంది పలికాయి. ఆకలి మంటల నుంచి అంతరిక్షానికి రాకెట్లు పంపే స్థితికి తీసుకెళ్లాయి. అందుకే ‘భారతరత్న’ దక్కని నిజమైన ‘భారతరత్నం’ పీవీ అనడంలో అతిశయోక్తి లేదు.
గెలిచినివాడిని విజేత అంటారు... గెలిపించేవాడిని నాయకుడు అంటారు..
అలాంటి అరుదైన నాయకుడు పీవీ నరసింహారావు.
ఇందిరగాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు ప్రధానులుగా వారు తీసుకున్న ప్రతి కీలక నిర్ణయం వెనక ఉన్న అదృశ్యహస్తం పీవీ.
కానీ, ఆయన పుట్టిపెరిగిన కాంగ్రెస్సే ఆయనను మరిచిపోయినప్పుడు చరిత్ర కూడా ఆయన గొప్పదనాన్ని మరచిపోవడంలో తప్పేం లేదు.
‘ఇన్ సైడర్’ పీవీ రాసిన పుస్తకం. ఇది ఆయన ఆత్మకథ అని చాలా మంది అభిప్రాయం. ఆయన తనను తాను ఇన్ సైడర్ గా భావించుకున్నారు. కానీ, గాంధీ వంశం వారు కాదని కాంగ్రెస్ పీవీని అవట్ సైడర్ గా చూసింది.
తమ పార్టీ కాదని బీజేపీ కూడా ఆయనను అవుట్ సైడర్ గానే భావించింది. దక్షణాది వ్యక్తి అని ఉత్తర భారతీయులు.. ఢిల్లీ కే పరిమితమయ్యారని సౌత్ ఇండియన్ లు ఆయనను అవుట్ సైడర్ గానే చూశారు.
రాజకీయ యోధుడిగానే కాదు రచయితగా, బహుభాషా కోవిదుడిగా కూడా పీవీ పేరు తెచ్చుకున్నారు.
వేయిపడగలను హిందీలోకి అనువదించారు. ఆకాశ రామన్న పేరుతో అనేక కథలు, వ్యాసాలు రాశారు. కొన్ని కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగడుతూ కూడా రాయడం విశేషం.
భారతీయ భాషల్లోనే కాదు ఆయనకు స్పానిష్ భాషలోనూ ప్రవేశం ఉంది.
రాజీవ్ హయాంలో కంప్యూటర్లను భారత్ కు దిగుమతి చేసుకోవాలని భావిస్తున్న సమయంలో పీవీ తనకు తెలిసిన వారితో అమెరికా నుంచి కంప్యూటర్ తెప్పించుకున్నారట. పట్టుబట్టిమరి కోబాల్ట్, సీ లాంగ్వెజ్ లను అప్పుడే నేర్చుకున్నారట.
పీవీ తన రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చేశారు. ఏ కాంగ్రెస్ అయితే ఆయనను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిందో ఆ కాంగ్రెస్సే ఆయన చనిపోయినప్పుడు ఘోరంగా అవమానించింది.
కనీసం పార్టీ కార్యాలయానికి ఆయన పార్థీవదేహాన్ని తీసుకరావడానికి కూడా అనుమతించలేదు.
గల్లీ నాయకుడికే విగ్రహాలు కట్టి పూజిస్తున్న నేటి కాలంలో ఢిల్లీనేలిన తెలుగు బిడ్డకు రాజధానిలో కనీసం ఒక్క విగ్రహం కూడా పెట్టనివ్వలేదు.
అటు రష్యాను, ఇటు అమెరికాను ఏకకాలంలో మచ్చిక చేసుకొని భవిష్యత్తు భారతానికి పునాది వేసిన పీవీ తన పార్టీవారికి మాత్రం అంటరానివారిగా మిగిలిపోయారు.
వరంగల్ నుంచి ఢిల్లీ వరకు సాగిన పీవీ అలుపెరగని రాజకీయ ప్రస్థానంలో పీవీ ఎన్నో పదవులు ఎక్కారు. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అత్యంత క్లిష్ట సమయాల్లో, పార్టీ నుంచే తీవ్ర ఒత్తడి వచ్చిన సమయంలో కూడా పీవీ తాను తీసుకున్న నిర్ణయాన్ని నిక్కచ్చిగా అమలు చేశారు.
ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేయడం, ప్రధానిగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం ఆయనను నిజంగా నరసింహుడిని చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు అమలు చేయడంతో ఆయన పార్టీ వారే ఆయనకు వ్యతిరేకంగా మారారు. ముల్కీ నిబంధనలను సమర్థించడంతో ఆయన పదవిని ఊడగొట్టించారు.
ఇందిర, రాజీవ్ ల హయాంలో వారికి విధేయుడిగా కేంద్ర మంత్రిగా పలు కీలక నిర్ణయాల్లో భాగం పంచుకున్నారు.
క్లిష్ట సమయలను పరిష్కరించే ట్రబుల్ షూటర్ గా పేరుతెచ్చుకున్నారు.
రాజీవ్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి మహామహులు పోటీలో నిలిచిన ప్రధానపీఠం పీవీనే వరించింది.
భారత్ బంగారం వరల్డ్ బ్యాంకులో తాకట్టు పెట్టిన క్లిష్ట పరిస్థితుల్లో సహాసోపేతంగా ఆర్థికసంస్కరణలకు శ్రీకారం చుట్టారు. లుక్ ఈస్ట్ పాలసీ విధానంతో విదేశీ సంస్థల ఏర్పాటుకు ఊతమిచ్చారు.
సరైన సంఖ్యా బలం లేకున్నా ఐదేళ్లు ప్రధానిగా రాణించారు. కానీ, బాబ్రీ మసీద్ కూల్చివేత, హవాలా కుంభకోణం ఆయన రాజకీయ జీవితానికి ఒక మచ్చలా మిగిలిపోయాయి.
పీవీ ఆర్థిక సంస్కరణలే నేటి డిజిటల్ ఇండియాకు నాంది పలికాయి. ఆకలి మంటల నుంచి అంతరిక్షానికి రాకెట్లు పంపే స్థితికి తీసుకెళ్లాయి.
అందుకే ‘భారతరత్న’ దక్కని నిజమైన ‘భారతరత్నం’ పీవీ అనడంలో అతిశయోక్తి కాదు.
( నేడు పీవీ నరసింహారావు వర్ధంతి )
