Asianet News TeluguAsianet News Telugu

దేశమంతా ‘కరెన్సీ సంక్షోభం’ వార్తలే

ఏనాడు వార్తలను పట్టించుకోని కుటుంబాల్లోని వారు కూడా ఇపుడు ప్రతీ రోజూ కరెన్సీ కష్టాల గురించే టివిలను చూస్తున్నారు.

extensive coverage for Demonetization

గడచిన 19 రోజులుగా ఒకే అంశంపై దేశం మొత్తం మీద మీడియా తన దృష్టిని పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయా? ఖచ్చితంగా లేవనే సమాధానం చెప్పవచ్చు. స్వతంత్ర్య భారత దేశంలో ఈ స్ధాయిలో దేశప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యను ఇంత వరకూ ప్రజలు నేరుగా అనుభవించలేదు కాబట్టే మీడియా సదరు అంశానికి అంతటి ప్రాధాన్యమిస్తున్నది. ఆ అంశమే ప్రస్తుతం యావత్ దేశాన్ని పట్టి కుదిపేస్తున్న ‘కరెన్సీ సంక్షోభం’. ఇటు కన్యాకుమారి నుండి అటు జమ్ము, కాశ్మీర్ వరకూ ఏ నోట విన్నా, ఏ ఇంట చూసినా ఇదే చర్చ.

 

గతంలో సునామీ వచ్చినపుడు నష్టం దేశంలోని తమిళనాడు వంటి తీర ప్రాంతాలకే పరిమితమైంది. లాతూరులో భూకంపం సంభవించినా గుజరాత్ రాష్ట్రం మాత్రమే నష్టపోయింది. హుద్ హూద్ సంభవించినా ఏపిలోని విశాఖపట్నం తీర ప్రాంతమే దారుణంగా దెబ్బతింది. ఇక, ఉగ్రవాదం, తీవ్రవాద సమస్యలు ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం. కానీ ప్రస్తుత ‘పెద్ద నోట్ల రద్దు’ అన్నది పైన పేర్కొన్న వాటన్నింటికన్నా దారుణమైనది.

 

దేశంలోని 127 కోట్ల జనాభాలో సుమారు 120 కోట్ల మంది జీవితాలను గడచిన 19 రోజులుగా ప్రతిరోజు అతలాకుతలం చేసేస్తోంది. నోట్ల రద్దు ఫలితంగా కరెన్సీ సంక్షోభం భారిన పడని కుటుంబాలు దేశంలో దాదాపు లేవనే చెప్పవచ్చు. పైగా ఈ సంక్షోభం మరో ఆరు మాసాలు తప్పవని బ్యాంకింగ్ నిపుణులు, ఆర్ధిక శాస్త్ర వేత్తలు చేస్తున్నహెచ్చరికలు కోట్లాది కుటుంబాలను మరింత భయపెడుతున్నాయి.  

 

దానికితోడు కేంద్రప్రభుత్వం కూడా రోజుకో నిబంధంనను ప్రకటిస్తుండటం, ప్రధానమంత్రి నరేంద్రమోడి చెబుతున్న మాటలకు, క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం పొంతన  లేకపోవటంతో బాధిత ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం సడులుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

కోట్లాది కుటుంబాల నట్టింట్లో వచ్చి తిష్టవేసిన కరెన్సీ సంక్షోభంపై ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకునేందుకు యావత్ దేశం మొత్తం మీడియాను అనుక్షణం అంటిపెట్టుకుంది. ఏనాడు వార్తలను పట్టించుకోని కుటుంబాల్లోని వారు కూడా ఇపుడు ప్రతీ రోజూ కరెన్సీ కష్టాల గురించే టివిలను చూస్తున్నారు.

 

దాంతో జాతీయ, ప్రాంతీయ స్ధాయిలోని టివి ఛానళ్ళతో పాటు వార్తా పత్రికలు సైతం కరెన్సీ సంక్షోభాన్ని ఎప్పటికప్పుడు అందివ్వటానికి నిరంతరం పోటి పడుతున్నాయి. అంతమాత్రానా దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు లేవని చెప్పలేము. అన్నీ సమస్యలకన్నా కరెన్సీ సంక్షోభం ప్రతిఒక్కరి జీవితాలను ప్రత్యక్షంగా పట్టి పీడిస్తోంది కాబట్టి గడచిన 19 రోజులుగా దేశంలోని యావత్ మీడియా నోట్ల రద్దు, తదనంతర పరిణామాలకు ఇస్తున్న కవరేజి ఆ స్ధాయిలో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios