పలు విషయాల్లో ముగ్గురికీ అనేక సారూప్యాలుండటమే విశేషం.

ముగ్గురూ ముగ్గురే. ఎవరికి వారే జనహ్రుదయనేతలు. వారే నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జె. జయలలిత. అందులో ఇద్దరు సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా చేస్తే మరోకరు తమిళనాడు రాష్ట్రానికి సిఎంగా పనిచేసారు. అవటానికి తమిళనాడుకు ముఖ్యమంత్రే అయినా జయలలిత కూడా తెలుగింటి ఆడపడుచే కావటం గమనార్హం. పలు విషయాల్లో ముగ్గురికీ అనేక సారూప్యాలుండటమే విశేషం.

రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందు పై ముగ్గురిలో ఎన్ టి ఆర్, జయలలితల నేపధ్యం సినిమా ఫీల్డే కావటం యాధృచ్చికం. చిత్రసీమలోనే అశేష అభిమానులను సంపాదించుకున్న పై ఇద్దరు ఆ తర్వాత ప్రజా జీవితంలోకి ప్రవేశించి రాజకీయాల్లో కూడా తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు. అదేవిధంగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వృత్తి రీత్యా వైద్యుడైనప్పటకీ రాజకీయాల్లో అడుగుపెట్టి తిరుగులేని నేతగా ఎదిగారు.

ముగ్గురు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో పేదల పక్షపాతిగా ముద్రవేయించుకున్న వారే. ఎన్టిఆర్ పేదల కోసం రూ. 2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదల కోసం జనతా వస్త్రాలను ప్రవేశపెట్టారు. వెనుక బడిన తరగతుల కోస పక్కా ఇళ్ల నిర్మాణాన్ని ఆరంభించారు. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించారు.

జయలలిత కూడా పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు. అమ్మ భోజనం, అమ్మ మందులు, అమ్మ క్యాంటిన్లు, రేషన్ సరుకులు, ఉచితంగా టివిలు, విద్యార్ధినులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ తదితర ఉచిత కార్యక్రమాలన్నెటింనో అమలు చేసారు. దాంతో జయ తిరుగులేని నేత అనిపించుకున్నారు.

ఇక, వైఎస్ ఆర్ కూడా పేదల కోసం బాగానే తపనపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, వృద్ధాప్య ఫించన్లు, 108 అంబులెన్స్, విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ లాంటి అనేక పథకాలను అమలు చేయటం ద్వరా పేదల పక్షపాతిగా పేరుపొందారు.

ఇక, రాజకీయంగా తీసుకుంటే ముగ్గురూ మడమ తిప్పని వారే. తాము ఎంత అనుకుంటే అంతే. అనుకున్నది అనుకున్నట్లు అమలు చేయటంలో ఎవరినీ లెక్క చేయని మనస్తత్వమే ముగ్గురిదీ. ప్రత్యర్ధులనుకున్న వాళ్లని దూరంగా పెట్టేయటమే కాదు వారిని పాతాళానికి తొక్కేసే వారకూ నిద్రపోరు.

అలాగే, తమ వాళ్ళుగా ముద్రపడితే చాలు ఇక వారి కోసం ఏమి చేయటానికైనా వెనకాడని మనస్తత్వం కూడా ఉన్నది. ఒక విధంగా ముగ్గురివీ ప్రత్యర్ధులకు విపరీతమనస్తత్వాలుగా కనిపిస్తుంటాయి. అయినా సరే లెక్కచేయలేదు. సరిగ్గా అటువంటి మనస్తత్వమే పై ముగ్గురినీ ప్రజల్లో తిరుగులేని జనహ్రుదయ నేతలుగా నిలిపింది.