కాంగ్రెసుకు చిక్కులు: ఆ టేప్ నకిలీదని సొంత పార్టీ ఎమ్మెల్యే

Embarrassment for Congress: Party MLA says bribe tape against BJP 'fake'
Highlights

కాంగ్రెసు పార్టీని సొంత ఎమ్మెల్యేనే ఇబ్బందుల్లోకి నెట్టారు.

బెంగళూరు: కాంగ్రెసు పార్టీని సొంత ఎమ్మెల్యేనే ఇబ్బందుల్లోకి నెట్టారు. యడ్యూరప్ప బలపరీక్ష సందర్భంగా తనను కొనుగోలు చేయడానికి బిజెపి ప్రయత్నించిందంటూ పార్టీ విడుదల చేసిన టేప్ నకిలీదని యెల్లాపూర్ కాంగ్రెసు శాసనసభ్యుడు శివరాం హెబ్బార్ అన్నారు.

తనకు వల వేయడానికి బిజెపి నేతలు తన భార్యతో మాట్లాడారంటూ కాంగ్రెసు విడుదల చేసిన టేప్ తారుమారు చేసిందని, అది నిజమైన ఆడియో టేప్ కాదని అన్నారు. ఆ టేప్ ను బయటపెట్టినవారిని ఆయన తప్పు పట్టారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. 

ఆయన పెట్టిన పోస్టు బిజెపికి అస్త్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బిజెపి నేతలు తన భార్యతో మాట్లాడారంటూ ఆడియో క్లిప్పింగ్స్ విడుదల చేసినట్లు తాను అసెంబ్లీలో ఉండగా తెలిసిందని, అది తన భార్య గొంతు కాదని, ఆమెకు ఏ విధమైన కాల్ కూడా రాలేదని ఆయన అన్నారు. 

ఆ ఆడియో టేప్ ను శనివారంనాడు కాంగ్రెసు నేత ఉగ్రప్ప విడుదల చేశారు. తమకు మద్దతు ఇస్తే 15 కోట్ల రూపాయలు ఇస్తామని బిజెపి నేతలు హెబ్బార్ భార్యతో చెప్పినట్లు అందులో రికార్డయి ఉంది.

శనివారం బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెసు ఆరు ఆడియో టేప్ లను విడుదల చేసింది. వాటిలో యడ్యూరప్ప మాట్లాడినట్లు చెబుతున్న టేప్ కూడా ఉంది. 

loader