దేశ రాజధాని డిల్లీలో రోజు రోజుకు మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి.  నిర్భయపై అత్యాచార ఘటన దేశంలో సంచలనంగా మారినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాల ద్వారా మహిళలకు రక్షణ కల్పించే ఏర్పాట్లు చేశారు. అయినా మహిళలు చిన్నారులపై లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా ఓ ఎనిమిది నెలల చిన్నారిని ఓ మృగాడు హత్యాచారం చేసిన సంఘటన డిల్లీలో చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఈ చిన్నారిపై జరిగిన అత్యాచారం కలకలం సృష్టిస్తోంది. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని శాకూర్‌బస్తీకి చెందిన దంపతులకు 8 నెలల క్రితం ఓ ఆడబిడ్డ పుట్టింది. అయితే భర్త కూలీపనులకు, భార్య ఇండ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తారు కాబట్టి ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న చిన్నారి పనికివెళ్లే సమయంలో బంధువుల ఇంట్లో వదిలి వెళ్లిపోయేవారు. ఇదే క్రమంలో నిన్న వీరిద్దరు పనులకు వెళ్తూ చిన్నారిని బంధువుల ఇంట్లో వదిలివెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం పాపను వదిలిన ఇంటికి వెళ్లగా అక్కడ పసిగుడ్డు గుక్కపట్టి ఏడుస్తూ కనిపించింది. అంతే కాదు చిన్నారి బట్టల నిండా రక్తపు మరకలు ఉండటంతో తీవ్ర ఆందోళనకు లోనైన దంపతులు పాపను ఆస్పత్రికి తరలించారు.  వైద్యపరీక్షలు జరిపిన వైద్యులు.. ఆ బిడ్డ అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించారు. 

 దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి లోనై బంధువులను ప్రశ్నించగా, సూరజ్(28) అనే యువకుడు చిన్నారిని ఆడిస్తానని మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు సూరజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా... చేసిన తప్పును అంగీకరించాడు. దీంతో నిందితుడిని పోస్కో చట్టం కింద కేసు నమోదుచేశారు.

ఇలా అభం శుభం తెలియని చిన్నారిపై అతి కిరాతకంగా అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘాలతో పాటు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.