ఎక్కడైనా రెస్టారెంట్ కి వెళితే.. మనకు నచ్చిన భోజనాన్ని ఆర్డర్ చేసి తృప్తిగా భోజనం చేస్తాం. ఆ తర్వాత తిన్నదానికి బిల్లు చెల్లించి బయటకు వస్తాం. కానీ.. ఈ రెస్టారెంట్ లో నచ్చిన ఫుడ్ తృప్తిగా తినొచ్చు.. కానీ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు.  ఇంతకీ ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉందో తెలుసా..? కేరళ రాష్ట్రంలోని అలపజా జిల్లాలో ఉంది. ‘ పీపుల్స్ రెస్టారెంట్’ పేరుతో ఈ నెల 3వ తేదీ( మార్చి 3) ఈ రెస్టారెంట్ ని ప్రారంభించారు. ఉచితంగా భోజనం పెట్టే.. ఈ రెస్టారెంట్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా..

‘ స్నేహ జలకం’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ రెస్టారెంట్ ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కార్యకర్తల విరాళాలతోనే ఈ రెస్టారెంట్ ని నిర్వహిస్తున్నారు. ఉచితంగా పెడుతున్నారు కదా.. క్వాలిటీ ఫుడ్ పెట్టరేమో అనే సందేహం మీకు రావొచ్చు. ఇందులో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే అందించారు. అంతెందుకు కూరగాయాలను సేంద్రియ పద్ధతుల్లో ప్రత్యేకంగా పండించి మరీ.. భోజనానికి ఉపయోగిస్తున్నారు. ఈ రెస్టారెంట్ పక్కనే 2.5 ఎకరాల భూమి ఉంది. అందులో కూరగాయలు పండిస్తున్నారు.

రోజుకి మూడు పూటలు భోజనాన్ని అందిస్తారు. ఈ రెస్టారెంట్ బిల్డింగ్ కూడా స్నేహజలకం సంస్థ కార్యకర్తల విరాళాలతో నిర్మించారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదనే భావనతో వీళ్లు ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. రోజుకి కనీసం వెయ్యి మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఈ హోటల్ ని కేరళ రాష్ట్ర మంత్రి థామస్ ఇజాక్ ప్రారంభించారు. అనంతరం ఈ హోటల్ గొప్పదనాన్ని వివరిస్తూ.. ఫేస్ బుక్ లో ‘‘ మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఇక్కడ భోజనం చేయవచ్చు. ఒక వేళ డబ్బులు ఇవ్వాలి అనుకుంటే మాత్రం కౌంటర్ దగ్గర ఉన్న బాక్సులో డబ్బులు వేయవచ్చు’’ అని పోస్టు చేశారు.

ఆయన పోస్టుతో ఈ హోటల్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. భోజనం నచ్చి.. డబ్బు ఎంతో కొంత ఇవ్వాలి అనుకున్నవారు అక్కడ ఉన్న బాక్సులో తోచినంత వేసి వెళ్లిపోవచ్చు.